Tribal Area Development మన్యం అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:00 AM
Efforts for Tribal Area Development జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
పార్వతీపురం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ‘నాపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడకు పంపించారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తా. అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతా. మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై పట్టు సాధిస్తా. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా ప్రగతిపై దృష్టి సారిస్తా. ఇందుకు ప్రతి ఒక్కకూ సహకరించాలి. గతంలో కంటే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా కూడా సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందించాలి.’ అని కలెక్టర్ కోరారు. అంతకముందు ఆయనకు జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి, ఏఎస్పీ అంకితా సురాన, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాఽథ్, డిప్యూటీ కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, దిలీప్ చక్రవర్తి తదితరులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
సమన్వయంతో పనిచేయాలి
జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి సూచించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘ సీనియర్ల అనుభవాలు, సూపర్‌విజన్ జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి. ప్రభుత్వ ప్రాధాన్య అంశాల లక్ష్యాలను గడువుకు ముందే సాధించాలి. ప్రతి అధికారీ బాధ్యతగా విధులు నిర్వహిస్తే సత్ఫలితాలు సాధించొచ్చు. అన్ని శాఖల ధికారులు రానున్న రెండేళ్లలో సాధించబోయే ప్రణాళిక విజన్‌ను పారదర్శకంగా రూపొందించాలి.’ అని తెలిపారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు సాధించిన పురోగతిని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
జిల్లాకేంద్రాసుపత్రి సందర్శన
బెలగాం: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వసతులు ఎలా ఉన్నాయి? వైద్య సేవలు సరిగా అందుతున్నాయా? లేదా! అని ఆరా తీశారు. ఆసుపత్రి అభివృద్ధిలో ఎటువంటి రాజీ పడవద్దని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో భాస్కరరావు, డీసీహెచ్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై నివేదిక అందించండి
జిల్లాలో సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ప్రతి సమస్యపై నివేదిక అందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.