Share News

Tribal గిరిజన మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:14 AM

Efforts for the Economic Development of Tribal Fisherfolk గిరిజన మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం శంబర గ్రామానికి సమీపంలోని వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌)ప్రాజెక్టులో నాలుగు లక్షల చేప పిల్లలను విడిచి పెట్టారు.

 Tribal గిరిజన మత్స్యకారుల  ఆర్థికాభివృద్ధికి కృషి
వెంగళరాయసాగర్‌లో చేప పిల్లలను విడిచిపెడుతున్న మంత్రి సంధ్యారాణి

మక్కువ రూరల్‌, నవంబరు18(ఆంధ్రజ్యోతి): గిరిజన మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం శంబర గ్రామానికి సమీపంలోని వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌)ప్రాజెక్టులో నాలుగు లక్షల చేప పిల్లలను విడిచి పెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘గిరిజన మత్స్యకారుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆండ్ర, పెద్దగెడ్డ, వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టుల్లో పెద్దఎత్తున చేపల పెంపకం చేపట్టి, వాటి క్రయ, విక్రయాల బాధ్యతలు వారికి అప్పగిస్తున్నాం. వీఆర్‌ఎస్‌ పరిధిలో ఉన్న 420 మంది మత్స్యకార సొసైటీ సభ్యుల కోసం ఏటా సాగరంలో లక్షలాది చేప పిల్లలను విడిచిపెడుతున్నాం. చేప పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులో 40 శాతం లబ్ధిదారుని వాటా కింద చెల్లించాల్సి ఉంది. అయితే గిరిజన మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా ఆ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది. మత్స్యశాఖ 40శాతం సబ్సిడీపై సొసైటీ సభ్యులకు అందిస్తున్న బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలను సద్వినియోగం చేసుకోవాలి.’ అని తెలిపారు. మత్స్యకార సొసైటీలకు మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో గిరిజనుల కోసం వెచ్చించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్య సంపదను పెంచేందుకు మన్యంలో 280ఎకరాల విస్తీర్ణంలో చెరువులను గుర్తించామని, ఇందులో 180 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశామని జిల్లా మత్స్యశాఖాధికారి టి.సంతోష్‌ తెలిపారు. మరో 110 చెరువుల్లో చేపల పెంపకానికి సంబంధించి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తోటపల్లిలో 10లక్షలు, వెంగళరాయసాగర్‌లో 4లక్షల చేప పిల్లలను విడిచిపెట్టామని చెప్పారు. మరోరెండు నెలల్లో మరో లక్ష చేప పిల్లలను ఈఆర్‌ఎస్‌లో విడిచి పెడతామన్నారు.

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి

వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి సంధ్యారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సందర్శకుల కోసం బెంచీలు ఏర్పాటు చేయా లని, సాగరంలో బోటు షికారు కోసం ఐదు బోట్లు కొనుగోలు చేయాలని సూచించారు. బోట్లు నడప డంపై గిరిజన యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ వైశాలి, ప్రాజెక్టు డీఈఈ సురేష్‌, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:14 AM