Manyam మన్యం అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:45 PM
Efforts for the Development of Manyam జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిసారించారన్నారు. శుక్రవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల పరేడ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత మంత్రి సంధ్యారాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం పెద్దపీట
గిరిజన ప్రాంతాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధుల మంజూరు
జిల్లాకేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నృత్య ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
పార్వతీపురం, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిసారించారన్నారు. శుక్రవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల పరేడ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత మంత్రి సంధ్యారాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ ఏడాది కాలంగా ప్రజలకు మంచి పాలన అందిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. సూపర్‌సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన అనుభవంతో చక్కని పరిపాలన అందిస్తున్నారు. రాష్ర్టాన్ని పెట్టుబడులకు నిలయంగా చేసి ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. పేదరికం నిర్మూలనలో భాగంగా బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని ఈ నెల 19న సీఎం లాంఛనంగా ప్రారంభించ నున్నారు. సాలూరు మండలం జిల్లేడువలస పంచాయతీ కార్యదర్శి మూడు కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయం. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఏడు సేవలను వాట్సాప్ గవర్నర్స్ ద్వారా అందనంగా ప్రజలు పొందొచ్చు. ‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాల్లో కోట్లాది రుపాయలు జమ చేశాం. అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పింఛన్లు అందిస్తున్నాం.’ అని తెలిపారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు
‘గిరిజన ప్రాంతాల్లో 373 పాఠశాలల అభివృద్ధికి రూ. 45 కోట్లు మంజూరు చేశాం. సన్న బియ్యం సరఫరా చేస్తూ విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. గిరిజన యువతకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. గత మూడేళ్లుగా జిల్లా రాష్ట్రస్థాయిలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా స్ర్పేయింగ్ చేపడుతున్నాం. డ్రోన్లు ద్వారా యాంటీ లార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. జిల్లాలో ఐదు కొత్త అంబులెన్స్‌లు ప్రారంభించాం. సాలూరు, భద్రగిరి, కురపాం ఆసుపత్రుల్లో అదనపు వసతుల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పూర్తికి రూ. 50 కోట్ల చొప్పున కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 1,22,260 మంది రైతులకు తొలివిడతగా రూ.85 కోట్లు జమ చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8,768 మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు మంజూరు చేశాం. పార్వతీపురంలో రూ.74 లక్షలతో జీడి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాం. తోటపల్లి, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో సాగనీరు అందిస్తున్నాం. రూ.2.36 కోట్లతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రూ.3.63 కోట్లతో బీసీ కార్పొరేషన్ ద్వారా 15 కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా 1454 మందికి శిక్షణ అందిస్తున్నాం. దీపం-2 పథకం కింద మూడు లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నాం. ఇప్పటివరకు సబ్సిడీ కింద రూ.23.62కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.7,500 కోట్లు , రహదారుల నిర్మాణానికి రూ.1300 కోట్లు కేటాయించాం. జిల్లాలో చిలకమున్నింగి రోడ్డు పనులకు రూ.2.50 కోట్లు మంజూరు చేశాం. ఆది కర్మయోగి పథకం కింద గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. రానున్న మూడేళ్లలో 320 అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 575 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.610 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. రూ.10 కోట్లతో పూర్ణపాడు- లాబేసు వంతెన పనులు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుం టున్నాం. సీతంపేట గిరిజన మ్యూజియం పూర్తికి, ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేసింది. రాష్ట్రంలో 13,816 గిరిజన గ్రామాల్లో తాగునీరు సరఫరా కోసం రూ. రెండు వేల 373 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో రెండు గిరి బజార్ సంచాలర వాహనాలు ప్రారంభించాం. రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జిల్లా విజేతగా నిలవడం ఆనందంగా ఉంది. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, జేసీ శోభిక, సబ్ కలెక్టర్ వైశాలి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
పార్వతీపురం టౌన్: గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సీతంపేట, గరుగుబిల్లి కేజీబీవీ, పార్వతీపురం కొత్తవలస కొత్తపోలమ్మ , తీరుమళ్ల రామ్మూర్తి మున్సిపల్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నృత్య ప్రదర్శనలు, థింసా డ్యాన్సులు, పిరమిడ్ విన్యాసాలతో ఆకట్టుకు న్నారు. అనంతరం మంత్రి వారికి బహుమతులు అందజేశారు. మరోవైపు జిల్లా వృత్తివిద్యాశాఖాధి కారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 150 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిచాయి. ఐసీడీఎస్, విద్యాశాఖ , గ్రామీణ నీటి సరఫరా శాఖల శకటాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సొంతం చేసుకున్నాయి.