Share News

Education Sector సంస్కరణలతో విద్యారంగం బలోపేతం

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:50 AM

Education Sector Strengthened Through Reforms సంస్కరణలతో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు.

Education Sector  సంస్కరణలతో  విద్యారంగం బలోపేతం
షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్‌

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి లోకేశ్‌

పార్వతీపురం, జూన్‌9(ఆంధ్రజ్యోతి): సంస్కరణలతో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు-2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని రాయల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 95 మందికి, ఇంటర్‌ ఫలితాల్లో మెరిసిన 26 మందికి ఆయన అవార్డులు అందించారు. అనంతరం మంత్రి లోకేశ్‌ మాట్లా డుతూ... మెరుగైన ఫలితాలు సాధనకు వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌ అమలు చేస్తున్నామన్నారు. టెన్త్‌ ఫలితాల్లో మన్యం జిల్లా హ్యాట్రిక్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. టెన్త్‌ తర్వాత విద్యార్థులకు కొత్త జీవితం ప్రారంభమవుతుంని, ఒకసారు పక్కదారి పడితే భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రుల పరిస్థితులను బట్టి నడుచుకోవాలని సూచించారు.

విభేదాలు స్పష్టించేందుకు కుట్ర

పార్వతీపురం, జూన్‌9(ఆంధ్రజ్యోతి): ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు స్పష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం చినబొండపల్లిలో టీడీపీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ యువగళంలో నాడు అడ్డుకున్న పోలీసులే నేడు సెల్యూట్‌ చేస్తున్నారు. అదీ ప్రజాతీర్పు. ప్రతిపక్షంలో ఆనాడు చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే గేట్లకు తాళ్లు కట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. నాపై 23 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసులు పెట్టారు. యువగళం పాదయ్రాతో మైక్‌,స్టూల్‌ లాక్కున్నారు. అయినా బిల్డింగ్‌ పైకి ఎక్కి మాట్లాడా. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నా జాగ్రత్తగా వ్యవహరించాలి. అహంకారం, అడ్డగోలు అరెస్టులు, బూతులు వద్దని ప్రజలు వైసీపీని తిరస్కరించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమికి పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. జూలై నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలి. పింఛన్లు, దీపం-2 , గ్యాస్‌ సబ్సిడీ , తల్లికి వందనం తదితర వాటిని ప్రజలకు తెలియజేయవాలి. వైసీపీ దుష్పప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ’ అని తెలిపారు.

- గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘ అరకు పార్లమెంట్‌ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్వతీపురంలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించలేని పరిస్థితి ఉండేది. వైసీపీ సర్కారు ఎన్నో అక్రమ కేసులు పెట్టి.. దౌర్జన్యాలకు తెగబడింది. అందుకే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. మంత్రిగా నేడు ఈ స్థానంలో ఉన్నానంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీవెనలే కారణం.’ అని తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ... నాది టీడీపీ కుటుం బం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచా. తెలుగుదేశం నాయకుడిగా ఉండడం నా అదృష్టం. నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కుటుంబంలో నేను సభ్యుడిగా ఉంటా.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త దామచర్ల సత్య, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పర్యటన సాగిందిలా..

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోమవారం ఉదయం 10:45 గంటలకు పార్వతీపురం చేరుకున్నారు. మంత్రి గుమ్మిడి సంఽద్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి తదతరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహిళలు హారతులిచ్చారు. 12 గంటలకు రాయల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో షైనింగ్‌ స్టార్స్‌ పేరిట విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుల వినతి పత్రం అందుకునేందకు మంత్రి వచ్చారు. అనంతరం మళ్లీ విద్యార్థులతో సమావేశమై పురస్కారాలు అందించారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు పార్వతీపురం మండలం చినబొండపల్లిలో టీడీపీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు.

Updated Date - Jun 10 , 2025 | 12:50 AM