Share News

విద్యకు అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:38 AM

‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విద్య పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలి.

విద్యకు అత్యంత ప్రాధాన్యం
మాట్లాడుతున్న మంత్రులు శ్రీనివాస్‌, సంధ్యారాణి

- వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరిస్తాం

- ప్రవేశాలు తగ్గడంపై సర్వే చేయండి

- వైద్య కళాశాల పనులు పూర్తి కావాలి

- రైతులకు విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందించాలి

- జడ్పీ సమావేశంలో మంత్రులు శ్రీనివాసరావు, సంధ్యారాణి

విజయనగరం రూరల్‌ , జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విద్య పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ఎందుకు తగ్గాయో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయండి.’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ భవనంలో చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరీతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు గతేడాది కంటే తగ్గాయని జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1,04,478 ప్రవేశాలు జరగ్గా, ఈ ఏడాది 96,397 జరిగాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు. కార్పొరేట్‌ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. భోగాపురం, విజయనగరంతో పాటు పలు ప్రాంతాల్లోని వసతి గృహాల్లో సమస్యలు ఉన్నాయని ప్రజాప్రతినిధులు సమావేశ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడుతో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా తమ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను తెలియజేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ఎందుకు తగ్గాయో విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాలన్నారు. విద్యా పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్‌ఆర్‌ నిధులు సమీకరించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ని కోరారు. జిల్లాలోని వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ4.50కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి రాగానే వసతులు కల్పిస్తామని కలెక్టర్‌ చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడోసారి కూడా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి జడ్పీ సమావేశంలో అభినందనలు తెలిపారు.

వైద్య కళాశాల పనులు వేగవంతం చేయాలి

వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో జడ్పీ చైర్మన్‌ ్జశ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రస్తుతం కళాశాలలో మూడు అంతస్థుల భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా మూడు అంతస్థుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు. ఇవి పూర్తయిన వెంటనే వైద్య కళాశాలకు ఆనుకుని ఉన్న భవనాల్లో ఏయే విభాగాలు ఏర్పాటు చేయాలన్న విషయాలను పరిశీలిస్తామని చెప్పారు. దీనిపై మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తిచేసిన తరువాత ఏయే విభాగాలు ఏర్పాటు చేయాలన్న దానిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

రైతులకు ఇబ్బందులు ఉండకూడదు

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు వరి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలన్నారు. విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈకేవైసీ, రీసర్వేలో తప్పులు తదితర అంశాలు రైతులకు ఇబ్బందిగా మారాయని అన్నారు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటికే 98 శాతం సమస్యలు పరిష్కరించామని, ఇంకా రెండు శాతం సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే జడ్పీ సమావేశానికి ఇరు జిల్లాల పరిధిలోని ఆర్డీవోలను ఆహ్వానించాలని కలెక్టర్‌ సూచించగా.. అందుకు జడ్పీ చైర్‌పర్సన్‌ అంగీకరించారు. కురుపాం ఎంపీపీ, జడ్పీటీసీలు వ్యవసాయశాఖ ఏవోపై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులకు సమాచారం కచ్చితంగా అందాలని, ప్రభుత్వ పథకాల్లో అందరినీ భాగస్వాములు చేయాలని అన్నారు.

ఏనుగుల సమస్యను పరిష్కరించండి

ఉమ్మడి జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించాలని జడ్పీ చైర్మన్‌తో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు కోరారు. దీనిపై జిల్లా అటవీశాఖాధికారి స్పందిస్తూ.. గజరాజుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుంకీ ఏనుగులు తీసుకు వచ్చిందన్నారు. అదే విధంగా 50 మంది నిష్ణాతులైన యువ టేకర్స్‌ని సిద్ధంగా ఉంచామన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకీ ఏనుగులు తీసుకురావడంలో కృషి చేసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పాలవలస యశస్వి తదితరులు ప్రశంసించారు. ఈ సమావేశంలో పార్వతీపురం-మన్యం కలెక్టరు, ఎమ్మెల్యేలు బేబి నాయన, బొనేల విజయచంద్ర, విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:38 AM