కడుపు నిండుగా తింటున్నారు..
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:00 AM
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తీరు పూర్తిగా మారింది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని నిర్వాహకులు వండుతున్నారు.
- మధ్యాహ్న భోజన పథకం భేష్
- సన్న బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం
- ఇష్టంగా ఆరగిస్తున్న విద్యార్థులు
- ఎంతో రుచిగా ఉంటుందని ఆనందం
విజయనగరం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తీరు పూర్తిగా మారింది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని నిర్వాహకులు వండుతున్నారు. దీంతో విద్యార్థులు కడుపు నిండా, మనసారా భోజనం చేస్తున్నారు. అన్నం చాలా రుచిగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకం అధ్వానంగా ఉండేది. ముదక బియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టేవారు. దీంతో అన్నం మెత్తగా తయారయ్యేది. ఈ అన్నం తినేందుకు విద్యార్థులు ఇష్టపడేవారు కాదు. చాలామంది విద్యార్థులు ఇళ్ల నుంచి కేరేజిలను తీసుకువచ్చేవారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు మార్చి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తోంది. దీంతో వారు ఎంతో సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. సన్నబియ్యంతో కూడిన అన్నం, ఆపై క్రమం తప్పకుండా మెనూ అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వారు ముందుగా ఆహారాన్ని రుచి చూస్తున్నారు. బాగుంటేనే పిల్లలకు పెడుతున్నారు. భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. గతం మాదిరిగా పిల్లలను బహిరంగంగా విడిచిపెట్టకుండా డైనింగ్ హాల్‌లో భోజనాలు పెడుతున్నారు. మధ్యాహ్న భోజనం తీరు మారడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు 2,283 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో ప్రతిరోజూ విద్యార్థులకు సన్నబియ్యంతోనే భోజనాలు పెడుతున్నారు. ఇందుకుగాను నెలకు 600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గతంలో పౌరసరఫరాలశాఖ నుంచి డీలర్లకు.. అక్కడి నుంచి విద్యాసంస్థలకు బియ్యాన్ని అందించేవారు. దీనివల్ల పెద్ద ఎత్తున అవకతవకలు జరిగేవి. ప్రస్తుతం గోదాముల నుంచే విద్యాసంస్థలకు నేరుగా 25 కిలోల బియ్యం బస్తాలను తరలిస్తున్నారు. ఈ బస్తాలపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను హెచ్‌ఎంలు స్కాన్ చేస్తే ఓటీపీ వస్తుంది. అప్పుడు ఈ బియ్యాన్ని వారికి అందిస్తున్నారు. దీనివల్ల సన్నబియ్యం పక్కదారి పట్టే అవకాశం ఉండడడం లేదు.
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఫోర్ట్‌ఫైడ్ బియ్యం కావడంతో పురుగు పట్టేందుకు అవకాశం లేదు. వంట నిర్వాహకులు తప్పకుండా మెనూను పాటించాలి. ఉపాధ్యాయులు సైతం పర్యవేక్షించాలి.
- మాణిక్యం నాయడు, డీఈవో, విజయనగరం