Easier ration మరింత సులువుగా రేషన్
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:55 PM
Easier ration రేషన్‌కార్డుదారులకు ఊరట. చౌకధరల దుకాణాల పనివేళలపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉచిత బియ్యం, ఇతర సరుకులను లబ్ధిదారులు ఇకపై ఎప్పుడైనా తీసుకోవచ్చని, ఇందుకోసం రేషన్ షాపులు నెలంతా తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మరింత సులువుగా రేషన్
ఇకపై నెలంతా పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం
అందుబాటులోకి ఇంకొన్ని సరుకులు
డీలర్ల ఆదాయం పెంచేలా చర్యలు
మార్కెట్‌లో సరుకుల ధరలకూ కళ్లెం
బొబ్బిలి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి):
రేషన్‌కార్డుదారులకు ఊరట. చౌకధరల దుకాణాల పనివేళలపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉచిత బియ్యం, ఇతర సరుకులను లబ్ధిదారులు ఇకపై ఎప్పుడైనా తీసుకోవచ్చని, ఇందుకోసం రేషన్ షాపులు నెలంతా తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 15 రోజులలోపే తీసుకోవాలనే కాలపరిమితిని తీసేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. రేషన్ దుకాణాలు 365 రోజులూ తెరిచే ఉంటాయని, ప్రజలు తీరిక ఉన్న సమయంలో లేదా అవసరమైనప్పుడు సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు నెలలో 15 రోజులలోపు మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. ఆ సమయంలో తీసుకోనివారు తర్వాత తీసుకునే అవకాశం లేక.. ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి వస్తోంది. ఇక నుంచి నెలలో ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. ఇదిలా ఉండగా వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
మార్కెట్ ధర కంటే తక్కువకు..
రేషన్ దుకాణాలను నెలంతా తెరచి ఉంచటం ద్వారా ప్రభుత్వం డీలర్ల ఆదాయం పెంచే ఆలోచన కూడా చేస్తోంది. ఇందుకోసం పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా కంపెనీల నుంచి సరుకులు కొనుగోలు చేసి, మార్కెట్ ధర కంటే తక్కువకు వినియోగదారులకు అందేలా చూడాలని భావిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి ఆయా సంస్థలు, సహకార సంఘాల ద్వారా ఆర్గానిక్ సరుకులను కూడా రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ఇదే సమయంలో రేషన్ విషయంలో సమస్యలు, సందేహాలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్‌చేసి సహాయం పొందవచ్చు.
- గత ప్రభుత్వం రేషన్ డిపోలను విలేజ్ మాల్స్‌గా తీర్చిదిద్దుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఆ తర్వాత విస్మరించింది. గతంలో రేషన్‌డిపోల్లో బియ్యం, పంచదారతో పాటు పామాయిల్, కందిపప్పు, గోధుమలు వంటివి సరఫరా చేసేవారు. ఇప్పుడు బియ్యం, పంచదారకు మాత్రమే పరిమితమైపోయింది. సుమారు 8 నెలల నుంచి కందిపప్పు సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.దీంతో రేషన్‌కార్డుదారులు మార్కెట్‌లో అధిక ధరకు కందిపప్పు కొనుగోలు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. త్వరలో మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- రేషన్ డిపోలను నెలంతా తెరిచి ఉంచుతూ వాటిల్లో ఆర్గానిక్ వస్తువులు, పప్పుధాన్యాలు, వంట నూనె, గోధుమపిండి వంటివి పంపిణీ చేయాలనుకుంటోంది. ప్రస్తుతం బియ్యంతో పాటు అరకిలో పంచదారను రూ.17 చొప్పున విక్రయిస్తున్నారు. అంత్యోదయ కార్డులున్న వారికి 35 కిలోల బియ్యంతో పాటు కిలో పంచదారను కేవలం రూ.13.50 మాత్రమే విక్రయిస్తున్నారు. నెలంతా రేషన్ డిపోను కొనసాగించి అన్ని రకాల సరకులను అందుబాటులోకి తెస్తే అటు డీలర్లకు, ఇటు రేషన్ కార్డుదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మంచి నిర్ణయం
చీమల రాంబాబు, దివ్యాంగుల సంఘం ప్రతినిధి, ఇందిరమ్మకాలనీ, బొబ్బిలి
రేషన్ డిపోలను నెలంతా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా మంచిది. నిత్యావసర సరుకులను రేషన్‌డిపోల్లో అందజేస్తే పేద, మధ్యతరగతివర్గాల వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ సరఫరా వ్యవస్థను సరిచేసి ఒక గాడిలో పెడుతోంది. వంటనూనె, కందిపప్పు, గోధుమపిండి, పంచదార వంటివి సరఫరా చేస్తే ధరల భారం నుంచి పేదలకు ఉపశమనం కలుగుతుంది.
ఆదేశాలు రావాల్సి ఉంది
రెడ్డి సాయికృష్ణ, సీఎస్‌డీటీ, బొబ్బిలి
నెలంతా రేషన్ డిపోలను నడపాలన్నదానిపై మాకు ఎటువంటి ఆదేశాలు ఇంకా అందలేదు. బహుశా ఈ నెల నుంచే అమలు కావచ్చు. బొబ్బిలి పట్టణం, మండలంలో 35,285 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చర్యలు తీసుకున్నాం. పప్పుదినుసులు, వంటనూనె, గోధుమపిండి, మిల్లెట్స్ వంటి వాటికి డిమాండ్ ఉంది. వీటిని రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తే వినియోగదారులకు చాలా ప్రయోజనకరం.