Share News

Will You Release Water? పండుగల వేళ.. నీరిస్తారా?

ABN , Publish Date - May 26 , 2025 | 11:00 PM

During the Festive Season... Will You Release Water? పార్వతీపురంలో పండుగ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నా.. పుర ప్రజలకు మాత్రం తాగునీటి సమస్య వెంటాడుతోంది. బిందెడు నీటి కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అది కూడా రంగుమారిన నీరు సరఫరా కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 Will You Release Water? పండుగల వేళ.. నీరిస్తారా?
పార్వతీపురం మున్సిపాల్టీ పరిధి గంగసాగరం వద్ద ట్యాంకర్‌ వద్ద నీరు పడుతున్న స్థానికులు

ఉత్సవాలకు సమీపిస్తున్న సమయం

జిల్లాకేంద్రవాసులను వేధిస్తున్న తాగునీటి సమస్య

వారంలో రెండు రోజులే కుళాయిల ద్వారా సరఫరా

అది కూడా రంగుమారిన నీరే..

అధికారులకు పట్టని ప్ర‘జల’ కష్టాలు

పార్వతీపురం/టౌన్‌, మే26(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో పండుగ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నా.. పుర ప్రజలకు మాత్రం తాగునీటి సమస్య వెంటాడుతోంది. బిందెడు నీటి కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అది కూడా రంగుమారిన నీరు సరఫరా కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే పండుగలు ఎలా జరుపుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లకొకసారి నిర్వహించే ఉత్సవాల సమయంలో ప్ర‘జల’కు కష్టాలు లేకుండా చూడాలేరా? అంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా పండుగల పూటైనా పురపాలక సంఘ అధికారులు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేస్తారో లేదోనన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ పరిస్థితి..

పట్టణంలో జూన్‌-1 నుంచి 3వ తేదీ వరకు పండుగలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగల పనులతో మున్సిపాల్టీ కొత్త శోభను సంతరించుకున్నప్పటికీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వాస్తవంగా పట్టణ జనాభా సుమారు 70 వేలపైనే ఉంటుంది. రోజుకి 80 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. అయితే నాలుగు రోజులకొకసారి 38 లక్షల లీటర్ల నీటిని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మూడేళ్ల కొకసారి జరిగే ఇప్పలపోలమ్మ, యర్రకంచెమ్మతో పాటు బెలగాం బంగారమ్మ పండుగల సందర్భంగా బంధువులతో కలిసి వారి సంఖ్య మరింత పెరగనుంది. మరోవైపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 30 వార్డుల ప్రజలకు రోజుకి కనీసం 50 లక్షల లీటర్ల పంపిణీ చేయాల్సి ఉంది. మూడేళ్ల కిందట జరిగిన పండుగల సమయంలో ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారు. అయితే ఇప్పటికీ మున్సిపాల్టీలో పరిస్థితి మారకపోవడంతో ఈసారి పండుగలకు కూడా పార్వతీపురం వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొద్దిరోజులుగా కుళాయిల ద్వారా రంగు మారిన నీటిని సరఫరా చేస్తుండడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు.

ఎమ్మెల్యే సమీక్షించినా..

మున్సిపాల్టీలో తాగునీటి సమస్యపై ఈ నెల 15న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పురపాలక సంఘ అధికారులతో సమీక్షించారు. గ్రామదేవతల పండుగుల సందర్భంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూడాలని సూచించారు. పూర్తిస్థాయిలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. అయితే తాగునీటికి సంబంధించి ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోజూ సరఫరా చేయాలని ..

పార్వతీపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణ ప్రజలకు రోజూ కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని సీపీఎం, జనసేన పార్టీ నాయకులు, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధి తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, డీఆర్వో హేమలతకు వినతిపత్రాలు అందించారు. గ్రామ దేవతల పండుగలు సమీపిస్తున్న వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయాలని విన్నవించారు. ప్రస్తుతం కుళాయిల నుంచి రంగుమారిన నీరు వస్తుండడం వల్ల పట్టణవాసులు రోగాల పాలయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. సురక్షిత నీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇబ్బందులు లేకుండా చర్యలు

పార్వతీపురం మున్సిపాల్టీలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మలతో పాటు బంగారమ్మతల్లి పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేస్తాం. ఏడు ట్యాంకర్ల ద్వారా 30 వార్డులకు నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం.

-శ్రీనివాసరాజు, డీఈ పార్వతీపురం మున్సిపాల్టీ

Updated Date - May 26 , 2025 | 11:00 PM