Share News

Dumma of doctors in dialysis block డయాలసిస్‌ బ్లాక్‌లో వైద్యుల డుమ్మా

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:00 AM

Dumma of doctors in dialysis block ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డయాలసిస్‌ బ్లాక్‌లో డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, సమయపాలన పాటించడం లేదని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.

Dumma of doctors in dialysis block డయాలసిస్‌ బ్లాక్‌లో   వైద్యుల డుమ్మా
డయాలసిస్‌ బ్లాక్‌లో ఖాళీగా వైద్యుని కుర్చీ

డయాలసిస్‌ బ్లాక్‌లో

వైద్యుల డుమ్మా

సక్రమంగా పనిచేయని ఆర్‌వో ప్లాంట్‌

అయోమయంలో రోగులు

ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో డయాలసిస్‌ విభాగం తీరిది

విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డయాలసిస్‌ బ్లాక్‌లో డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, సమయపాలన పాటించడం లేదని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం డయాలసిస్‌ బ్లాక్‌లో డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో లేక రోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి డ్యూటీ డాక్టరు అందుబాటులో లేకపోవడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా సిబ్బంది నీళ్లు నమిలారు. అలాగే ఇక్కడ డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులను 15 రోజులకు ఒకసారి నెఫ్రాలజీ వైద్యులు పరీక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా సమయ పాలన పాటించడం లేదని, సక్రమంగా రావడం లేదన్న అభిప్రాయం రోగుల నుంచి వ్యక్తమవుతోంది. డయాలసిస్‌ బ్లాక్‌లో 81 మంది రోగులు ఉండగా 13 డయాలసిస్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. డయాలసిస్‌ అవుతున్న సమయంలో రోగులకు బీపీ వచ్చి పడిపోవడం అత్యంత ప్రమాదకరం. అలాగే రోగికి చలి, వణుకు, శ్వాస సమస్యలు లాంటి అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే స్పందించడానికి డ్యూటీ డాక్టరు అందుబాటులో ఉండాలి. లేకపోతే రోగులకు ప్రాణాపాయం కూడా. ఈ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు రోగులు తెలిపారు.

ఆర్‌వో ప్లాంట్‌లో పరీక్షలు అంతంతే!

డయాలసిస్‌ యూనిట్‌లో ఆర్‌వో (రివర్స్‌ ఆస్మోసిస్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సిస్టమ్‌) అనేది రోగుల ప్రాణాలతో నేరుగా సంబంధమున్న కీలక వ్యవస్థ. ఇది సరిగ్గా పనిచేయకపోతే డయాలసిస్‌ రోగి రక్తంలో విష పదార్థాలు చేరి ప్రాణాపాయం కలగవచ్చు. డయాలసిస్‌ యూనిట్‌లో రోజూ టీడీఎస్‌, కండవిక్టిటీ పరీక్షలు చేయాలి. వారానికి ఒకసారి బ్యాక్టీరియల్‌ టెస్ట్‌, నెలకొకసారి ఎండోటాక్సిన్‌ టెస్ట్‌, ప్రతి ఆరు నెలలకు సంపూర్ణ నీటి నాణ్యత నివేదికను రికార్డులో పొందుపరచాలి. క్షేత్రస్థాయిలో చూస్తే ఇటువంటి పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డయాలసిస్‌ యూనిట్‌లు అన్ని జిల్లాల్లో నెఫ్రో ప్లస్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాగా ఇక్కడి సమస్యలపై ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Dec 03 , 2025 | 12:00 AM