వ్యక్తి హత్యపై డీఎస్పీ దర్యాప్తు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:21 AM
కొత్తబగ్గాం గ్రామంలో మంగళవారం రాత్రి పసుపురెడ్డి శ్రీను హత్యకు గురైన సంఘటనకు సంబంధించి మృతుడి భార్య పసుపురెడ్డి జ్యోతి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు.
గజపతినగరం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కొత్తబగ్గాం గ్రామంలో మంగళవారం రాత్రి పసుపురెడ్డి శ్రీను హత్యకు గురైన సంఘటనకు సంబంధించి మృతుడి భార్య పసుపురెడ్డి జ్యోతి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలివీ.. పిల్లలకు నూడిల్స్ తీసుకువస్తానని శ్రీను తన భార్య జ్యోతి వద్ద రూ.300 తీసుకొని బయటకు వెళ్లాడు. శ్రీను, అతని సోదరుడు చంటి కలిసి కొనిస గ్రామం నుంచి ఒకే బైక్‌పై బయలుదేరారు. శ్రీనును చంపాలని ఎదురుచూస్తున్న చాకలి రామచంద్రుడు బగ్గాం గ్రామ సమీపంలో బైక్‌ను అడ్డగించాడు. దీంతో చంటితో పాటు అతని భార్య సత్యవతి శ్రీనును కత్తితో పొడిచి హత్య చేశారు. అదే సమయంలో అటు వైపు వెళుతున్న గోకా బాషా అనే వ్యక్తి జ్యోతికి సంఘటన గురించి తెలిపాడు. దీంతో ఆమె హుటాహుటిన అక్కడికి చేరుకునేసరికే భర్త ప్రాణాలు కోల్పోయాడు. చంటి భార్య ఏదో వస్తువును దాచుకొని వెళుతుండడం చూశానని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ భవ్య రెడ్డి గ్రామంలో ని మృతుడి ఇంటితో పాటు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలువ పక్కన ఉన్న రక్తపు మరకలను గుర్తించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆమె వెంట సీఐ రమణ, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడు, వీఆర్వో వెంకన్న, నడుపూరు కమల, మహిళా పోలీస్ కవిత తదితరులు ఉన్నారు.