DSC చెప్పిన దానికంటే ముందే.. డీఎస్సీ ఫలితాలు వెల్లడి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:17 AM
DSC Results Announced Earlier Than Expected నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. చెప్పిన దానికంటే ముందే మెగా డీఎస్సీ ఫలితాలను ప్రకటించింది. తొలుత ఈ నెల 15న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించినప్పటికీ ముందస్తుగా సోమవారం రాత్రి ప్రకటించారు.
సాలూరు రూరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. చెప్పిన దానికంటే ముందే మెగా డీఎస్సీ ఫలితాలను ప్రకటించింది. తొలుత ఈ నెల 15న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించినప్పటికీ ముందస్తుగా సోమవారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రంలో 16,347 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ ప్రకటించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్నంగా పరీశీలించిన తర్వాత సవరించిన తుది కీ ప్రకారం నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి తుది డీఎస్పీ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితం తెలుసుకోవడానికి క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్లి హాల్‌టిక్కెట్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. సర్వీసెస్ కనబడుతుంది. అక్కడ ఏపీ డీఎస్సీ ఫలితాలను సెలెక్ట్ చేస్తే స్కోర్ కార్డు వస్తుంది. స్కోర్ కార్డులో అభ్యర్థి పొందిన మార్కులు, టెట్ మార్కులు చూపిస్తూ.. క్వాలీఫైడ్, నాన్ క్వాలీఫైడ్ వివరాలొస్తాయి.
ఉమ్మడి జిల్లాలో 583 పోస్టులు
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తంగా 583 పోస్టులను చూపారు. మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలు 210, పాఠశాల సహాయకులు క్యాడర్‌లో తెలుగులో 14, హిందీలో 14, ఆంగ్లంలో 23,గణితంలో 8,భౌతికశాస్త్రంలో 32,జీవశాస్త్రంలో 20, సాంఘిక శాస్త్రంలో 62, పీఈటీ 63 మొత్తం 446 టీచర్ ఖాళీలు, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీలు 60 పాఠశాల సహాయకుల క్యాడర్‌లో ఆంగ్లంలో 7, గణితంలో 25, భౌతిక శాస్త్రంలో 24, జీవశాస్త్రంలో 16,సాంఘిక శాస్త్రంలో 5 మొత్తం 137 టీచర్ పోస్టులు ఖాళీలను చూపించారు. ఈ ఖాళీలే కాకుండా డిఫరెంట్ ఏబుల్డ్ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్త యూనిట్‌గా చూపించిన 2,259 టీచర్ పోస్టుల్లో జోన్ ఒకటికి 400 కేటాయించారు. మరో రాష్ట్రం యూనిట్‌గా భర్తీ చేయనున్న 259 టీచర్ పోస్టులు సైతం ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చాయి.
మహిళ అభ్యర్థులే అధికం..
ఉమ్మడి జిల్లా నుంచి 18,001 మంది వివిధ పోస్టులకు 31,354 దరఖాస్తులందించారు. వారిలో మహిళా అభ్యర్థులు 10,425 మంది, పురుష అభ్యర్థులు 7892 మంది ఉన్నారు. డీఎస్సీ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 16,656 మందికి పైగా హాజరయ్యారు.