Share News

Drumbeat of Death మరణ మృదంగం

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:03 AM

Drumbeat of Death జిల్లాలో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. గత 20 రోజుల్లో నలుగురు మృత్యువాత పడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా కారణా లేమైనా కన్నవారికి కడుపుకోత తప్పడం లేదు. బాగా చదివి.. కుటుంబాలను ఆదు కోవాల్సిన వారు విగతజీవులుగా మారడం కలకలం రేపుతోంది.

Drumbeat of Death మరణ మృదంగం
చిన్నారి (ఫైల్‌)

  • 20 రోజుల్లో నలుగురు మృత్యువాత

  • అనారోగ్య సమస్యలే కారణం

  • కన్నవారికి కడుపుకోత.. సర్వత్రా ఆందోళన

  • ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే

  • పరిస్థితి మరింతగా విషమించే అవకాశం

పార్వతీపురం, అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. గత 20 రోజుల్లో నలుగురు మృత్యువాత పడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా కారణా లేమైనా కన్నవారికి కడుపుకోత తప్పడం లేదు. బాగా చదివి.. కుటుంబాలను ఆదు కోవాల్సిన వారు విగతజీవులుగా మారడం కలకలం రేపుతోంది. అనారోగ్య సమస్యలతోనే అత్యధి కంగా గిరిజన విద్యార్థులు మృతిచెందడం కలవరపరుస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించకపోతే పరిస్థితి మరింతగా విషమించే అవకాశముంది.

ఇదీ పరిస్థితి..

కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. మిగతా వారిలో కొందరు పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో, ఇంకొందరు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కోలుకున్నారు. వారిలో కొంతమంది ఇళ్లకు చేరుకున్నారు. ఈ ఘటనను మరువకముందే.. సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన ఒక విద్యార్థిని ఈ నెల 12న కేజీహెచ్‌లో మృతి చెందింది. తాజాగా మక్కువ మండలం చెందిన ఎర్ర సామంతవలస ఆశ్రమ పాఠశాలకు చెందిన చిన్నారి అనే గిరిజన విద్యార్థి కేజీహెచ్‌లో మృతి చెందాడు. మొత్తంగా గత నెల 25 నుంచి ఇప్పటివరకు ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థి మృతి చెందారు.

గత వైసీపీ హయాంలో..

గత ఐదేళ్లలో ఎంతోమంది గిరిజన విద్యార్థులు మరణించినా గత వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. కనీసం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా మంజూరు చేయలేదు. పైగా టీడీపీ ప్రభుత్వ కాలంలో ఆశ్రమపాఠశాలల్లో నియమించిన ఏఎన్‌ఎంలను పూర్తిగా తొలగించింది. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొరవడింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఎన్‌ఎంల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే వారి నియామకంలో ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. తక్షణమే నియామక చర్యలు తీసుకుంటే.. విద్యార్థుల మరణాలకు అడ్డుకట్ట పడుతందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

పర్యవేక్షణ లోపం..

జిల్లాలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. వాస్తవంగా అనారోగ్యానికి గురైన విద్యార్థులను గతంలో సిక్‌ రూముల్లో ఉంచి వైద్యం అందించేవారు. ఇప్పుడైతే అత్యధిక గిరిజన విద్యాలయాల్లో ఆ పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, కొంతమంది ఆశ్రమ పాఠశాలలో నిర్వాహకులు పిల్లలను స్వగ్రామాలకు పంపించేస్తున్నారు. దీంతో సరైన వైద్యం అందక కొందరు.. నాటు వైద్యం, మూఢనమ్మకాలకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వడంతో మరికొందరు విద్యార్థులు మృత్యువాతపడుతున్నారు. కనీసం సచివాలయ ఏఎన్‌ఎంలకు కూడా సమాచారం అందించడం లేదు. సంచి వైద్యులను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి గిరిజన విద్యాలయాల్లో పర్యవేక్షణ పెంచి, విద్యార్థులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

మరో విద్యార్థి మృతి

మక్కువ రూరల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం ఎర్రసామంతవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న తాడంగి చిన్నారి(10) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం వేకువజామున మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూలవలస గ్రామానికి చెందిన తాడంగి ముగిరి, కాంతమ్మ పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఏడేళ్ల భూమిక అదే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంది. ఇక చిన్నారి ఎర్రసామంతవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువు కొనసాగిస్తున్నాడు. అయితే గత నెల22న ఆ విద్యార్థి దసరా సెలవుల నిమిత్తం ఇంటికొచ్చాడు. సెలవులు పూర్తయినా పాఠశాలకు తిరిగి వెళ్లలేదు. దీంతో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులకు కబురు పంపారు. చిన్నారిని వెంటనే స్కూలుకు పంపాలని సూచించారు. అయితే అప్పటికే జ్వరంతో బాధపడుతున్న విద్యార్థికి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించాలని సూచించారు. దీంతో వారు ఈ నెల 8న శంబర పీహెచ్‌సీకి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అయితే చిన్నారికి మలేరియా ఉన్నట్లు తేలడంతో అదేరోజున పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్యం మెరుగుపడడంతో 9న వైద్యులు డిశ్చార్జి ఇచ్చారు. దీంతో చిన్నారి ఇంటికి చేరుకున్నాడు. 10న పాఠశాలలో చేరాడు. రెండు రోజులు ముగిసిన తరువాత 12న కడుపు నొప్పిగా ఉందంటూ వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం వెంటనే బాలుడిని శంబర పీహెచ్‌సీకి పంపగా అక్కడి వైద్యుల సూచన మేరకు సాలూరు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి వెంటనే విజయనగరం ఘోషాసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత చిన్నారికి కిడ్నీలో ఏదో సమస్య ఉందని వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలో వారి సూచనల మేరకు మంగళవారం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో విద్యార్థిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స ప్రారంభించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం తెల్లవాజామున 4గంటల సమయంలో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు ఆశావర్కర్‌ అమ్మాజమ్మ తెలిపారు. కాగా తమ బిడ్డ మృతిని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని భోరున విలపిస్తున్నారు. తమ కుమారుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యసేవలు అందలేదని వారు ఆరోపిస్తున్నారు.

అధికారులే బాధ్యత వహించాలి

చిన్నారి మృతిపై రైతుకూలీ సంఘం, సీపీఎం నాయకులు విచారం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల వరుస మరణాలకు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మర ణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వచ్చే వరకు దహనసంస్కారాలు చేయబోమని వారు పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీపురం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి హుటాహుటిన మూలవలస చేరుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. అనారోగ్యంతో మరణిస్తున్న గిరిజన విద్యార్థుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజాసంఘాల నాయకులు శాంతించారు. ఆ తర్వాత చిన్నారి అంత్యక్రియలు నిర్వ హించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ మేరకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో వెంటనే ఏఎన్‌ఎంలను నియమించాలని వారు డిమాండ్‌ చేశారు.

శాయశక్తులా కృషి చేశాం

పార్వతీపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కాపాడడానికి శాయశక్తులా కృషి చేశాం. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడం బాధాకరం.’ అని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 16 , 2025 | 12:03 AM