Drugs are harmful to society మత్తు పదార్థాలు సమాజానికే హానికరం
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:50 PM
Drugs are harmful to society మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో సమాజానికి ముప్పు కలుగుతోందని, వాటి మనుగడ, ఉనికిని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. రాజాం పోలీసుస్టేషన్‌ను ఆయన గురువారం తనిఖీ చేశారు.
మత్తు పదార్థాలు
సమాజానికే హానికరం
సైబర్ నేరగాళ్ల బారిన పడేవారిలో విద్యావంతులే ఎక్కువ
అవగాహనతో మెలగాలి
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
రాజాం రూరల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి):
మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో సమాజానికి ముప్పు కలుగుతోందని, వాటి మనుగడ, ఉనికిని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. రాజాం పోలీసుస్టేషన్‌ను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్ తదితర వాటిపై ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పోలీసు సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. బంగారు భవిష్యత్ కలిగిన యువత చెడు మార్గంలో పయనించకూడదన్న లక్ష్యంతో ఈ సైకిల్ యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మన పిల్లలు, ఇరుగుపొరుగువారెవరూ ఈ మహమ్మారి బారిన పడకూడదని, సమాజానికి చేటు చేస్తున్న ఏ నేరగాళ్లను ఉపేక్షించకూడదని, పౌరులంతా బాధ్యతాయుతంగా మెలిగి అలాంటి వారిని కట్టడి చేయాల్సి ఉందన్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయిందని, సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నవారిలో ఎక్కువ మంది అధిక విద్యావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర అధికారులు, రిటైర్డ్ అధికారులు ఉండడం దురదృష్టకరమన్నారు. ఫేక్ ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు ఆందోళనకు గురికాకుండా తక్షణం సమీపంలోని పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. డీఐజీ వెంట ఏఎస్‌పీ సౌమ్యలత, చీపురుపల్లి డీఎస్‌పీ రాఘవులు, సీఐ అశోక్‌కుమార్ ఉన్నారు.