Share News

Drug Stopped మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:49 PM

Drug Trafficking Must Be Completely Stopped జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్‌, గంజాయి నివారణపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ, జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీల సమావేశం నిర్వహించారు.

Drug Stopped  మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, నవంబరు29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్‌, గంజాయి నివారణపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ, జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి పది ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసుకుని విస్తృతం ప్రచారం నిర్వహించాలి. కళాశాల, పాఠశాలల్లోని విద్యార్థులనూ చైతన్యపర్చాలి. స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులను ఇందులో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో అవగాహన ద్వారానే డ్రగ్స్‌ నివారణ సాధ్యమవుతుంది. సమస్యలు ఉన్న చోట ప్రణాళి కలు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలి.’ అని తెలిపారు. గ్రామస్థాయిలో పక్కాగా పౌర హక్కుల దినోత్స వాలను చేపట్టాలన్నారు. ఇందులో అట్రాసిటీ కేసులు, సారా, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను గ్రామస్థులకు తెలియజేయాలని సూచించారు. సంతలు జరిగే ప్రదేశాలు, షాపుల వద్ద నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాలు విక్రయించే వారి వివరాలు సేకరిం చాలని ఆదేశించారు. అవగాహన, చైతన్య కార్యక్రమాల ఫొటోలు, వీడి యోలను తమకు అందిం చాలన్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించాలని తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, మిగతా వాహనదారులు సీట్‌ బెల్ట్‌ పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపేవారికి జరిమానా విధించాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలులో ప్రగతి కనిపించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల పూర్తి సమాచారం ఆయా శాఖల అధికారుల వద్ద ఉండా లన్నారు. పెండింగ్‌ పనుల వివరాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల య్యేలా చూసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, సబ్‌ కలెక్టర్లు వైశాలి, డీఎస్పీ ఎం.రాంబాబు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

జిల్లాలో టెన్త్‌ విద్యార్థులందరూ శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మైస్కూల్‌, మై ప్రైడ్‌ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ‘ టెన్త్‌ ఫలితాల్లో గత మూడేళ్లుగా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాం. ఈ ఏడాది కూడా జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగు, విద్యార్థుల ఆరోగ్యం కోసం నూతన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. ‘ముస్తాబు’తో విద్యార్థుల ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పిల్లల మానసిక ఉల్లాసం కోసం పాఠశాలల్లో ‘ఆనందలహరి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులతో నృత్య ప్రదర్శనలతో పాటు యోగా, ఏరోబిక్స్‌ చేయిస్తున్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఈవో బి.రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:49 PM