Drones in the hands of women మహిళల చేతికి డ్రోన్లు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:24 AM
Drones in the hands of women ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. తాజాగా సాగులో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది. తద్వారా మహిళలకు ఆర్థిక చేయూత ఇవ్వాలనుకుంటోంది. స్వయం సహాయక సంఘ సభ్యుల చేతికి డ్రోన్లను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం కింద డ్రోన్లను అందించనుంది.
మహిళల చేతికి డ్రోన్లు
కేంద్రం ‘నమో డ్రోన్ దీదీ’కి శ్రీకారం
మహిళా సంఘాలకు రాయితీపై అందజేత
జిల్లాలో ముందుకొచ్చిన 15 మంది
రాజాం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. తాజాగా సాగులో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది. తద్వారా మహిళలకు ఆర్థిక చేయూత ఇవ్వాలనుకుంటోంది. స్వయం సహాయక సంఘ సభ్యుల చేతికి డ్రోన్లను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం కింద డ్రోన్లను అందించనుంది. సాంకేతికత, చదువు తదితర అంశాలపై అవగాహన ఉండి.. వ్యవసాయం చేసేవారికి వీటిని అందించనున్నారు. 80 శాతం రాయితీ ఇస్తారు. ఇప్పటివరకూ జిల్లాలో 15 మంది ముందుకొచ్చారు. ముఖ్యంగా రైతులకు రసాయనాలు, ఎరువుల పిచికారీ సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. లేనిపోని రుగ్మతల బారిన పడుతుంటారు. కూలీల ఖర్చు కూడా తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా డ్రోన్ల ద్వారా ఎకరా పొలంలో పది నిమిషాల్లోనే పిచికారీ చేయొచ్చు.
ప్రస్తుతం స్వయం సహాయక సంఘ సభ్యుల ఎంపిక జరుగుతోంది. సాధారణంగా రైతు కుటుంబాల నుంచి స్వయం సహాయక సభ్యులు ఉంటారు. అటువంటి వారికి ఈ పథకం ఎంతో ప్రయోజనం. డ్రోన్ విలువ రూ.10 లక్షల వరకూ ఉంటుంది. కానీ రూ.2 లక్షలకే అందిస్తారు. ప్రభుత్వ రాయితీ రూ.8 లక్షలు. లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.2 లక్షలను కూడా బ్యాంకు రుణంగా అందిస్తుంది. ఎంపికైన మహిళలకు 15 రోజుల పాటు శిక్షణనిస్తారు. వారి కుటుంబసభ్యుడికి మెకానిక్, డ్రోన్ అసిస్టెంట్ విధులపై 5 రోజుల పాటు శిక్షణ నిస్తారు.
చిన్న, సన్నకారు రైతులే..
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 4.26 లక్షల ఎకరాలు, రబీలో 2.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. మొత్తం 3.56 లక్షల మంది రైతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మూడొంతుల మంది చిన్నసన్నకారు రైతులే. వీరి కుటుంబాల్లో స్వయం సహాయక సభ్యులు ఉంటారు. అటువంటి వారంతా డ్రోన్లు పొందవచ్చు. అయితే సాధారణంగా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేసుకోలేరు. గతంలో టీడీపీ ప్రభుత్వం 70 శాతం రాయితీపై పంట కోత యంత్రాలు, 50 శాతం సబ్సిడీపై స్ర్పేయర్లు, బరకాలను అందించేది. అవి ఎంతో ఉపయుక్తంగా ఉండడంతో సాగు పెట్టుబడులు, మదుపులు తగ్గేవి. వైసీపీ హయాంలో ఐదేళ్లలో రైతు భరోసా అందిస్తున్నామని ఒకే ఒక కారణం చెప్పి రాయితీ పథకాలకు మంగళం పలికింది. అప్పట్లో డ్రోన్లు అందిస్తామని హడావుడి మాత్రమే చేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకుగాను డ్రోన్లను అందించేందుకు కసరత్తు చేస్తోంది. అది కూడా మహిళా సంఘాల సభ్యులకు అవకాశం ఇవ్వడం విశేషం.
కూలీల కొరత లేకుండా..
ప్రస్తుతం సాగులో పెట్టుబడులు పెరిగాయి. కూలీల ధరలూ అంతే. మదుపులు గురించి చెప్పనవసరం లేదు. ఎకరా పొలంలో క్రిమిసంహారక మందులు, ఎరువుల పిచికారీకి అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.2వేలు. అదే డ్రోన్ల ద్వారా వంద రూపాయలు కూడా కాదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు డ్రోన్ల సాయంతో సస్యరక్షణచేపడుతున్నారు. చాలా తక్కువ ఖర్చు అని రైతులు చెబుతున్నారు. డ్రోన్ తో రోజుకు పది ఎకరాల్లో సస్యరక్షణ చేపట్టవచ్చు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలుచేస్తోంది. మహిళలను భాగస్వామ్యం చేస్తూ ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రారంభించింది.
డ్రోన్లు మంజూరు చేస్తున్నాం
జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యలకు డ్రోన్లు మంజూరు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నమో దీదీ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. భారీగా రాయితీ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి.
- శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ, విజయనగరం
--------------------------