డ్రోన్ చూస్తోంది
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:03 AM
దొంగతనాలు.. గంజాయి సేవించడం.. చైన్ స్నాచింగ్.. ఆరుబయట స్థలాల్లో మద్యం తాగడం.. పేకాట ఆడటం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం.. తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు.
విజయనగరం క్రైం, జూలై8 (ఆంధ్రజ్యోతి)
దొంగతనాలు.. గంజాయి సేవించడం.. చైన్ స్నాచింగ్.. ఆరుబయట స్థలాల్లో మద్యం తాగడం.. పేకాట ఆడటం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం.. తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని పోలీసులు ఇట్టే పట్టేస్తు న్నారు. గతంలో పోలీసులు కిలోమీటరు దూరంలో ఉన్నప్పుడే అప్రమత్తమై పారిపోయేవారు. నేడు అలా కుదరదు. వారు రాకముందే డ్రోన్ వస్తుంది.. గుట్టుగా ఫొటోలు తీసి పంపిస్తుంది. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించినా ఫొటోల ఆధారంగా పట్టుబడుతున్నారు. డ్రోన్ కెమెరాలు వచ్చాక చట్ట వ్యవతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల కాలంలో డ్రోన్ ద్వారా పట్టుకున్న కేసులే జిల్లాలో ఎక్కువగా నమోదవు తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరాలను అదుపు చేస్తోంది. డ్రోన్‌లతో పోలీసుశాఖ ఎన్నో సత్ఫలితాలు సాధిస్తోంది.
- ఆధునిక డ్రోన్‌లో డ్యూయల్ కెమరా వ్యవస్థ ఉంది. రెండు కెమెరాలతో ఒకేసారి భిన్న కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. ప్రొఫెషనల్ ఫొట్రోగఫీ, వీడియోగ్రఫీ కోసం వీటిని రూపొందించినప్పటికీ పోలీస్ శాఖకు ఓ బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతోంది.
- జిల్లాలోని మూడు సబ్ డివిజన్లకు నాలుగు డీజేఐ ఎయిర్-3 డ్రోన్లను కేటాయించారు. ధర్నాలు, ఆందోళనలు, బహిరంగ సభలు, సమావేశాలు, వివాదాలను చిత్రీకరించడానికి వీటిని వినియోగిస్తున్నారు. బహిరంగ సభల్లో ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, జాతరలో చేతి వాటాల కట్టడికి కూడా ఉపయోగపడుతున్నాయి.
- ఈ డ్రోన్‌లు కిలోమీటరు ఎత్తు వరకూ ఎగురుతూ 2 లేదా 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే సంఘటనలు సైతం గుర్తిస్తాయి. సాంకేతికతతో అక్కడ ఎంత మంది వున్నారో లెక్కిస్తాయి. పగలు రాత్రీ కూడా ఫొటోలు తీయగలవు.
- పది మంది పోలీసు సిబ్బంది పనిచేయాల్సిన చోట ఒక డ్రోన్ పనిచేయగలుగుతుంది. పోలీసులకు సమయంతో పాటు తక్కువ సిబ్బంది సరిపోతున్నారు.
నేరాల నియంత్రణలో డ్రోన్‌లు కీలకం..
ప్రధాన కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్యలు, జన సంచారం లేని ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ సమావేశాలు, ఉత్సవాల్లో డ్రోన్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేరాలను నియంత్రించేందుకు దోహదపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి స్టేషన్‌కు ఒక డ్రోన్ కేటాయించి నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. ఇప్పటికే ఐదు సబ్ డివిజన్లలో ఐదు ప్రధాన కేంద్రాల్లో డ్రోన్‌లను వినియోగిస్తున్నాం. పలు కేసులు చేధించాం.
-ఎస్పీ వకుల్ జిందాల్