Double growth in five years ఐదేళ్లలో రెండింతల అభివృద్ధి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:23 AM
Double growth in five yearsవిజయనగరం జిల్లా వెనుకబడినది కాదని అన్ని వనరులతో ఐదేళ్లలో రెండింతల అభివృద్ధి చెందుతుందని హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక, పీ4 కార్యక్రమాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజన్ 2047లో భాగంగా పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఐదేళ్లలో రెండింతల అభివృద్ధి
స్వర్ణాంధ్ర 2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
హోంమంత్రి అనిత
పీ4లో భాగంగా 264 కుటుంబాలను దత్తత తీసుకుంటా మంత్రి శ్రీనివాస్
విజయనగరం/కలెక్టరేట్, జూలై 3 (ఆంరఽధజ్యోతి):
విజయనగరం జిల్లా వెనుకబడినది కాదని అన్ని వనరులతో ఐదేళ్లలో రెండింతల అభివృద్ధి చెందుతుందని హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక, పీ4 కార్యక్రమాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజన్ 2047లో భాగంగా పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రానున్న ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని నిర్దేశించారు. మూడు సెక్టార్లు, 5 సబ్‌సెక్టార్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. వ్యవసాయానికి సంబంధించి సాగులో లేకుండా ఉన్న భూములను గుర్తించి వాటిలో ప్రత్యామ్నాయ పంటలు, అంతర పంటలు వేసుకోవాలని.. దిగుబడిని కూడా పెంచి మార్కెటింగ్‌కు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు వ్యవసాయ, అనుబంధ శాఖలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జిల్లాకు వ్యవసాయాధారిత పరిశ్రమలు వచ్చేలా క్షేత్రస్థాయిలో ప్లానింగ్ ఉండాలని, ప్రణాళికలను కార్యాచరణలోకి తీసుకురావాలని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో డయేరియా, మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాల్లో పైపులైన్లు తనిఖీ చేయాలని, మరుగునీరు కుళాయిల్లో కలవకుండా చూడాలని ఆదేశించారు. వసతిగృహాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పిల్లలకు తాజా ఆహారం పెట్టేలా చూడాలని ఆధికారులకు సూచించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలకు అవకాశం ఉందని, అందులో వాణిజ్య పంటలైతే మరీ మంచిదన్నారు. సర్వీసు సెక్టారు కింద పర్యాటక రంగంలో సన్‌రే రిసార్ట్స్ వద్ద 150 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ నందు జీఎంఆర్ వారు రూ.150 కోట్లతో, అదానీ గ్రూపు 100 కోట్లతోనూ హోటళ్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎకో టూరిజం కింద తాటిపూడి జలాశయాన్ని అభివృద్ధి చేయడానికి రూ.23 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని, గ్రామీణ ప్రాంతాలను కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నారు.
264 కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి శ్రీనివాస్
పీ4లో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 264 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. తన గజపతినగరం నియోజకవర్గంలో 264 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, బూత్‌కు ఒక కుటుంబం చొప్పున దత్తత తీసుకున్నట్లు తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ తాను 20 కుటుంబాలను పీ4 కింద దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న బంగారు కుటుంబాలు-మార్గదర్శకుల వివరాలతో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీపీవోకి సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిటల్ బ్యాబ్, యోగా సెంటర్, రీడింగ్ రూంను ఎంపీ నిధులతో చేపడుతున్నట్లు చెప్పారు. అందుకు కావాల్సిన భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం మహిళల, ఆడపిల్లల రక్షణ కోసం పోలిస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సమావేశంలో ఎంఎల్‌సిలు ఇందుకూరి రఘురాజు, గాదె శ్రీనివాసలనాయుడు, ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు, లోకం మాధవి, ఎస్‌పీ వకుల్‌జిందాల్, జేసీ సేతుమాధవన్ తదితరులు ఉన్నారు.
గంజాయి ఎరులైపారింది: మంత్రి అనిత
గత ప్రభుత్వ హయంలో గంజాయి ఏరులై పారిందని మంత్రి అనిత అన్నారు. జిల్లాకు గురువారం వచ్చిన ఆమె తొలుత విలేకరులతో మాట్లాడారు. అప్పట్లో 10 వేల ఎకరాల్లో ఉన్న గంజాయి సాగును ఇటీవల నిర్వీర్యం చేశామన్నారు. ప్రస్తుతం 90 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నట్లు గుర్తించామని, గంజాయి సాగు నుంచి బయటకు వచ్చిన వారికి వివిధ రకాల పంటలు సాగు చేసేందుకు 44 వేల బస్తాల విత్తనాలు అందించామని చెప్పారు.