Farmers రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:38 PM
Don’t Trouble the Farmers రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, పంటను విక్రయించిన 24 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సాలూరు వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
మంత్రి సంధ్యారాణి
సాలూరు, నవంబరు17(ఆంధ్రజ్యోతి): రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, పంటను విక్రయించిన 24 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సాలూరు వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన విధంగానే ‘అన్నదాత సుఖీభవ’ పథకం రెండో విడత నిధులు ఈ నెల 19న రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. వరికి ఇప్పటికే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించగా, పత్తి క్వింటా ధర రూ.8,110గా నిర్ణయించింది. పంటలో తేమశాతం ఎక్కువగా ఉన్న వారికి నిల్వలు ఆరబెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత కొనుగోలు చేయాలి. మిల్లర్లు ఎవరూ రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు. ప్రభుత్వం రైతులను రాజుగా చూడాలను కుంటుంది. అన్నం పెట్టే రైతులను ఇబ్బందిపెడితే సహించేది లేదు. విశాఖలో జరిగిన సమ్మిట్ వల్ల సుమారుగా రూ.13 వేల కోట్లు పెట్టబడులు పెట్టేందుకు పలు కంపెనీలు పోటీ పడు తున్నాయి. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేడీ సుధాకర్, ఏఎంసీ ఏడీ ఏసురాజు, ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, సాలూరు, మక్కువ టీడీపీ అధ్యక్షులు తిరుపతిరావు, వేణుగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొఠియాపై ఒడిశా సీఎం సానుకూలం
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాస్పద ప్రాంతం కొఠియాపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పటి ఒడిశా సీఎంను కలిసి వచ్చాకే అనేక సమస్యలు వచ్చాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆయా గ్రామాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. అయితే ఈ విషయాన్ని పాడేరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కొఠియా గ్రామాలకు సంబంధించి న సమస్య పరిష్కారం కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
జలపాతాల అభివృద్ధికి చర్యలు
జిల్లాలో జలపాతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. తోణాం పంచా యతీ పరిధి శిఖపరువు సమీపంలో ఉన్న వాటర్‌ఫాల్స్‌లో ఏర్పాటు చేసిన షాపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిం చేలా జలపాతాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రాత్రిపూట బస చేసేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నామన్నారు.
టీచర్లతో వాలీబాల్ ఆడించిన కలెక్టర్
తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయులతో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వాలీబాల్ ఆడించారు. అనంతరం మెనూ సక్రమంగా అందుతుందా? లేదా! ముస్తాబు కార్యక్రమం ఎలా అమలవుతుందని నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ధికారులతో సమీక్షించారు.