మీ సరుకులు వద్దేవద్దు
ABN , Publish Date - May 09 , 2025 | 12:10 AM
తమకు ఒడిశా సరుకులు వద్దని కొఠియా గ్రూపు గిరిజనులు ఖరాఖండిగా చెప్పడంతో ఒడిశా అధికారులు కంగుతిన్నా రు.
సాలూరు రూరల్, మే 8 (ఆంధ్రజ్యోతి): తమకు ఒడిశా సరుకులు వద్దని కొఠియా గ్రూపు గిరిజనులు ఖరాఖండిగా చెప్పడంతో ఒడిశా అధికారులు కంగుతిన్నా రు. కొఠియా గ్రూపు ధూళిభద్ర, ఎగువశెంబి, దిగువశెంబి గిరిజనులతో ఒడిశా పొట్టంగి ఐసీడీఎస్ సీడీపీవో పి.అన్న పూర్ణ, సూపర్‌వైజరు తదితరులు గురువారం ఎగువశెంబి లో సమావేశం నిర్వహించారు. ఒడిశా అంగన్‌వాడీ సరుకులను వద్దనడం, చిన్నారులకు ఒడిశా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపకపోవడంపై వారు ప్రశ్నించారు. సరుకు లు తీసుకోవాలని, పిల్లలను పంపాలని కోరారు. ఇందుకు గిరిజనులు ససేమిరా అన్నారు. ఒడిశా సరుకులు, పథకా లు తమకొద్దన్నారు. తమను ఒడిశా పోలీసులు వేధిస్తు న్నారన్నారు. తమ పిల్లలు తెలుగు విద్యనే చదువుతున్నారని చెప్పారు. ఏపీ చేపట్టిన పనులు తాము చేయడంతో పలుసార్లు ఒడిశా అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే ఒడిశా పథకాలు తమకు అవసరం లేదని తెగేసి చెప్పారు. తాము ఏపీలోనే ఉంటామని వారు చెప్పంతో ఆ రాష్ట్ర అధికారులు అవాక్కయ్యారు. ఈ విషయమై తమకు రాసివ్వాలని ఐసీడీఎస్ అధికారులు కోరారు. జిల్లా కలెక్టర్ వస్తే మాట్లాడి రాసివ్వాలో లేదో నిర్ణయిస్తామని గిరిజనులు చెప్పారు. చివరకు ఐసీడీఎస్ అధికారులు చేసేదిలేక వెళ్లిపోయారు. సమావేశంలో గిరిజనులు చెప్పిన విషయాలను పొట్టంగి ఐసీడీఎస్ సీడీపీవో ఉన్నతాధికారులకు నివేదికిచ్చారు.