Don't ruin life జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:40 PM
Don't ruin life మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడి అరెస్టు అయితే జీవితం నాశనం అవుతుందని, భవిష్యత్తు అంధకారమేనని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో విశాఖ రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పాయకరావుపేట నుంచి మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు వెళ్తుంది. 13వ రోజు సోమవారం నగరంలోని కోట జంక్షన్‌కు చేరుకున్న ర్యాలీలో డీఐజీ మాట్లాడారు.
జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం
అభ్యుదయం సైకిల్ ర్యాలీలో డీఐజీ గోపీనాథ్ జట్టీ
విజయనగరం క్రైం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడి అరెస్టు అయితే జీవితం నాశనం అవుతుందని, భవిష్యత్తు అంధకారమేనని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో విశాఖ రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పాయకరావుపేట నుంచి మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు వెళ్తుంది. 13వ రోజు సోమవారం నగరంలోని కోట జంక్షన్‌కు చేరుకున్న ర్యాలీలో డీఐజీ మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యా సంస్థలు, పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత 16 నెలల్లో 2,467 మందిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేశామని, 67 మందికి పదేళ్లు కంటే ఎక్కువగా జైలు శిక్ష పడిందన్నారు. యువత ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల జీవితంపై పడే చెడు ప్రభావాన్ని ప్రజలు గుర్తించి వాటికి దూరంగా ఉండాలన్నారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమౌతోందన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాలీలో ఈగల్, ఎక్సైజ్, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహూతులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ర్యాలీ డెంకాడలో ప్రవేశించగా స్థానికులు, డెంకాడ పోలీసులు ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఏఎస్‌పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, డీఆర్‌ఓ శ్రీనివాసామూర్తి, ఆర్‌డీఓ కీర్తి, ఎక్సైజ్ ఈఎస్ శ్రీనాథుడు, డీఎస్పీలు గోవిందరావు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.