Revenue Issues రెవెన్యూ సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:29 PM
Don’t Neglect Revenue Issues రెవెన్యూ సమస్యలపై సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం పెద్దూరు కొండ దిగువ ప్రాంతంలో గృహ నిర్మాణాలను పరిశీలించారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలపై సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం పెద్దూరు కొండ దిగువ ప్రాంతంలో గృహ నిర్మాణాలను పరిశీలించారు. జీవో 30 మేరకు నిర్మాణాలు చేపట్టాలన్నారు. నిబంధనల మేరకు లబ్ధిదారులను రెగ్యులైజ్ చేయాలని సూచించారు. అర్హత కలిగిన వారి రెగ్యులైజేషన్‌కు ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్ పి.బాలను ఆదేశించారు. ఆ తర్వాత శివరాంపురంలో ఈ-క్రాప్ నమోదును పరిశీలించారు. రైతులు సాగు చేసే పంటల వివరాల నమోదులో తేడాలుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. అక్కడి నుంచి నేరుగా తహసీల్దార్ కార్యాల యానికి చేరుకుని కుల ధ్రువీకరణ పత్రాల మంజూరును పరిశీలించారు. మ్యూటేషన్లు, వెబ్ ల్యాండ్‌తో పాటు రెవెన్యూ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలో వీఆర్‌వోలు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. రెవెన్యూ సమస్యలపై ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించా లన్నారు. యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియాను సక్రమంగా పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆశ్రమ పాఠశాలలు ఆహ్లాదకరంగా ఉండాలి
పార్వతీపురం రూరల్: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉండాలని, మౌలిక వసతులు లోటు ఉండరాదని తెలిపారు. మంగళవారం రావికోన గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత విద్యార్థుల హాజరు, స్టోర్‌రూం, స్టాక్ రిస్టర్లు, కిచెన్‌షెడ్, టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పాఠశాలలో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులతో కాసేపు మాట్లాడి.. నోట్, వర్క్‌బుక్స్‌ను తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు మరింత పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం పెదబొండపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది తీరు, ఉచిత మందుల పంపిణీపై ఆరా తీశారు. అక్కడి నుంచి నేరుగా పెద్దబొండపల్లి అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని రికార్డులు పరిశీలించారు.