Don't go away. దూరమవ్వొద్దు
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:37 PM
Don't go away. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదని.. జంటలు, ప్రేమించానని తెలిస్తే పెద్దలు దండిస్తారని...యువకులు, భర్త సరిగా చూడడం లేదని.. మహిళలు, పరీక్ష తప్పితే తల్లిదండ్రులు కొడతారని విద్యార్థులు ఇలా వివిధ కారణాలతో జిల్లాలో కొంతకాలంగా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. కొందరిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇంకొందరి ఆచూకీని ఎన్నాళ్లయినా గుర్తించలేకపోతున్నారు. ఈ తరహా కేసుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నారు.
దూరమవ్వొద్దు
జిల్లాలో పెరుగుతున్న అదృశ్యం కేసులు
మహిళలు, బాలికలే అధికం
ప్రేమ, వివాహేతర సంబంధాలు, వేధింపులతోనూ ఘటనలు
ముభావంగా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్న నిపుణులు
ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదని.. జంటలు, ప్రేమించానని తెలిస్తే పెద్దలు దండిస్తారని...యువకులు, భర్త సరిగా చూడడం లేదని.. మహిళలు, పరీక్ష తప్పితే తల్లిదండ్రులు కొడతారని విద్యార్థులు ఇలా వివిధ కారణాలతో జిల్లాలో కొంతకాలంగా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. కొందరిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇంకొందరి ఆచూకీని ఎన్నాళ్లయినా గుర్తించలేకపోతున్నారు. ఈ తరహా కేసుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నారు.
రాజాం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 105 వరకూ అదృశ్య కేసులు నమోదయ్యాయి. కొందరి ఆచూకీని నేటికీ పోలీసులు గుర్తించలేకపోయారు. చిన్నచిన్న కుటుంబ కలహాలు, మనస్పర్థలతోనే ఎక్కువ మంది ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు. ప్రేమ, ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, వేధింపులు, చదువులో రాణించకపోవడం తదితర కారణాలతోనూ అదృశ్యమవుతు న్నారు. వీరిలో బాలికలు, మహిళలు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏడాదికేడాది ఇలా అదృశ్యమైనవారు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25 ఏడాదిలో ఏకంగా 252 కేసులు నమోదయ్యాయి. వీటిలో మహిళలు 114 మంది ఉన్నారు. బాలికలు 44 మంది, బాలురు 11 మంది, పురుషులు 83 మంది ఉన్నారు. 2025-26లో ఇప్పటివరకూ ఎనిమిది నెలల్లో 105 మంది అదృశ్యమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు 44 మంది అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. బాలికలు 24 మంది, పురుషులు 30 మంది, బాలురు ఏడుగురు మిస్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా కుటుంబంలో భార్య కాని, భర్త కాని చనిపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. పిల్లలకు ఆదరణ తగ్గి క్షోభకు గురవుతుంటారు. అటువంటివారు ఒంటిరితనాన్ని భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. జిల్లాలో ఇటువంటి కేసులు అధికమని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. పురుషుల అదృశ్యం కేసుల్లో ఎక్కువగా 60 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు.
- నడి వయసులో ఉన్న మహిళల అదృశ్యం వెనుక అనైతిక బంధం, వివాహేతర సంబంధాలే అధికంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా బాధితులు సైతం అదృశ్యమవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల ద్వారా పరిచయం అవుతున్న వారు ఆకర్షణకు లోనవుతున్నారు. వారికి కుటుంబ పరిస్థితులు అర్థంకావడం లేదు. అటువంటి వారు ఇళ్ల నుంచి బయటకు వెళ్తుండడం, పోలీస్ కేసులు నమోదవడం.. చివరకు పెద్దలు, కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చి తెస్తుండడం పరిపాటిగా మారింది.
పిల్లలను గమనిస్తుండాలి
ఛేదించిన కేసులు బట్టి పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలు, పని ఒత్తిడి, అనారోగ్యం, ఆర్థిక, మానసిక సమస్యలతో 40 శాతం మంది ఇళ్ల నుంచి బయటకు వెళుతున్నట్టు స్పష్టమవుతోంది. చదువులో రాణించలేదని, ప్రేమ ఆకర్షణతో 35 శాతం మంది వెళ్లిపోతున్నారు. ఇంట్లో మాటకు విలువలేదని మనస్తాపంతో 25 శాతం మంది ఇంటి నుంచి బయటకు అడుగువేస్తున్నారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదువు పేరుతో విపరీతమైన ఒత్తిడి కూడా చేయకూడదంటున్నారు. పిల్లలతో మంచి పుస్తకాలు చదివించాలని, వారిని ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లి చూపించాలని, వీలైనంత వరకూ సెల్‌ఫోన్లకు, సోషల్‌మీడియాకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
ముందే గుర్తించొచ్చు
మానసిక స్థితి బట్టి కొంతవరకు ముందే గుర్తించవచ్చు. ముభావంగా ఉండి, ఎవరితో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదంటే అనుమానించాల్సి విషయమే. వెంటనే కుటుంబసభ్యులు మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి. ఇబ్బందుల్లో ఉన్నవారిని చూసి అస్సలు ఎగతాళి చేయకూడదు. హేళనగా మాట్లాడకూడదు. వారి సమస్యను తెలుసుకొని ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేయడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన ఆహారం అందించడం, మంచి పుస్తకాలను చదివించడం ద్వారా వారిని అలాంటి ఆలోచనల నుంచి దూరం చేయవచ్చు.
- తిరుపతిరావు, మానసిక వైద్యనిపుణుడు, రాజాం