చెరువులనూ వదలట్లే!
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:03 AM
ఆక్రమణదారులు ప్రభుత్వ భూములు, స్థలాలతో పాటు చెరువులనూ వదలడం లేదు.
- యథేచ్ఛగా ఆక్రమణలు
- వరహాల గెడ్డ కూడా..
- సర్వేలకే పరిమితమైన అధికారులు
- చర్యలు చేపట్టడంలో వెనకడుగు
పార్వతీపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆక్రమణదారులు ప్రభుత్వ భూములు, స్థలాలతో పాటు చెరువులనూ వదలడం లేదు. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న చెరువులతో పాటు గెడ్డ సైతం ఆక్రమణకు గురవుతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఆక్రమణదారులకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. పార్వతీపురం మండలం బాగొడబ రెవెన్యూ పరిధిలోని చెరువు విస్తీర్ణం గతంలో 50 ఎకరాల పైబడి ఉండేది. ప్రస్తుతం ఆక్రమణలతో ఆ చెరువు విస్తీర్ణం సగం కూడా పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా కొత్తవలసలో సంగంనాయుడు చెరువు, కొత్త చెరువు తదితర చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని వరహాల గెడ్డ సైతం కబ్జాకు గురవుతోంది. గత కొన్నిదశాబ్దాలుగా ఈ గెడ్డ ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ ఇరిగేషన్‌శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తుంది. తాజాగా వరహాల గెడ్డ స్థలం చేతులు మారినట్లు తెలుస్తోంది. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు మాటలు చెప్పడమే తప్ప చేతల్లో మాత్రం చూపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా సర్వేలు నిర్వహించడం, తర్వాత ఆ నివేదికలను తుంగలోకి తొక్కడం పరిపాటిగా మారింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వరహాల గెడ్డ ఆక్రమణలపై అప్పటి రెవెన్యూ, ఇరిగేషన్, ఇంజనీరింగ్, మునిసిపల్ అధికారులు సర్వేలు నిర్వహించారు. కొన్ని రికార్డులు లేకపోయినా పూర్వపు రికార్డులను తీసుకొని వచ్చి మరీ సర్వే చేపట్టారు. తరువాత ఏమైందో గానీ ఆ సర్వే నివేదికలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. ఈ విషయమై తహసీల్దార్ సురేష్‌ను వివరణ కోరగా.. ‘వరహాల గెడ్డ ప్రాంతాన్ని సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించే బాధ్యతను మునిసిపల్ అధికారులకు అప్పగించాం. రెవెన్యూ శాఖ ద్వారా సర్వేకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాం. లంకెల చెరువు కూడా సర్వే చేస్తాం. నివేదిక వచ్చిన తర్వాత మా శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఇదే విషయమై ఇరిగేషన్ డీఈఈ ఉదయ్‌భాస్కర్‌ను వివరణ కోరగా.. ‘ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న చెరువులను సర్వే చేస్తున్నాం. వరహాల గెడ్డకు సంబంధించి ఆక్రమణలను గుర్తించాం.’ అని తెలిపారు.