Don't forget that minersమైనర్లు అని మర్చిపోవద్దు
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:14 AM
Don't forget that miners మైనర్ బాలురు బైక్ డ్రైవింగ్ చేయడం ఇటీవల కాలంలో జిల్లాలో పెరిగింది. పల్లె నుంచి పట్టణం వరకు ఇదే జరుగుతోంది. తల్లిదండ్రులు ముందుజాగ్రత్త లేకుండా వారికి వాహనాలు ఇస్తున్నారు. వీధిలోనే కదా అని అనుకుంటున్నారు. కానీ అలవాటు పడిన పిల్లలు ప్రధాన రహదారులపైకి కూడా వస్తున్నారు. సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత ఎదుటే ఇద్దరు బాలురు స్కూటీపై హల్‌చల్ చేయడం, ఆమె మందలించిన విషయం తెలిసిందే.
మైనర్లు అని మర్చిపోవద్దు
తల్లిదండ్రులూ జాగ్రత్త!
పిల్లలకు వాహనాలు ఇస్తే మూల్యమే..
హెచ్చరిస్తున్న పోలీస్ అధికారులు
స్వయంగా గుర్తించిన హోంమంత్రి అనిత
మైనర్ బాలురు బైక్ డ్రైవింగ్ చేయడం ఇటీవల కాలంలో జిల్లాలో పెరిగింది. పల్లె నుంచి పట్టణం వరకు ఇదే జరుగుతోంది. తల్లిదండ్రులు ముందుజాగ్రత్త లేకుండా వారికి వాహనాలు ఇస్తున్నారు. వీధిలోనే కదా అని అనుకుంటున్నారు. కానీ అలవాటు పడిన పిల్లలు ప్రధాన రహదారులపైకి కూడా వస్తున్నారు. సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత ఎదుటే ఇద్దరు బాలురు స్కూటీపై హల్‌చల్ చేయడం, ఆమె మందలించిన విషయం తెలిసిందే.
రాజాం, అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా మైనర్లు ద్విచక్ర వాహనాలపై కనిపిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసుల తనిఖీలు తక్కువయ్యాయన్న విమర్శలున్నాయి. వారు చూసీచూడ నట్టుగా వ్యవహరించడం వల్లే మైనర్లు వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. చిన్న వయసులో బైక్ అలవాటు పడుతూ కాస్త పెద్దయ్యాక ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. జూన్‌లో బొండపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆ ముగ్గరు రెండు పదుల వయసులో వారే. మే నెలలో డెంకాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఆ ఇద్దరూ చిన్నవయసు వారే. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లాడు మారం చేశాడానో.. అలుగుతున్నాడనో బైక్‌లు కొనిచ్చి చేతిలో పెడితే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల పల్లెల్లో సైతం ఇదే సంస్కృతి విస్తరిస్తోంది. ఇంటా ద్విచక్ర వాహన వినియోగం పెరుగుతోంది. మైనర్లు సైతం బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు. వారిని కుటుంబసభ్యులు నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అలవాటు అయ్యాక పెద్దలు చెప్పినా పిల్లలు వినడం లేదు.
ఆ కారణాలతోనే ప్రమాదాలు..
జిల్లాలో ఇటీవల ఏదోచోట ప్రమాదం జరుగుతూ ఉంది. హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మైనర్ల వాహనాలు నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తాము మాత్రం కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది ఏకంగా 60వేల వరకూ కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. అయినా ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టిసారించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ..ప్రమాదాలు జరిగి మూల్యం చెల్లించుకున్న తరువాత అయ్యో పాపం అని బాధపడుతున్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనం ప్రతి ఇంటికీ అవసరమే. కానీ పిల్లలు కోరిందే తడవుగా స్పోర్ట్స్ బైక్‌లు కొనిచ్చేస్తున్నారు. ఇలా బైక్‌లు సమకూర్చిన తరువాత చాలా మంది పిల్లలపై దుష్ట్రభావం పడుతోంది. వారు పక్కదారి పడుతున్నారు.
బైక్ రైడింగ్‌ల జోరు
సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది బైక్ రైడింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. స్పోర్ట్స్ బైక్‌లు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల్లో ప్రతి ఇంటా రేస్‌బైక్‌లు, స్పోర్ట్స్ బైకులు దర్శనమిస్తున్నాయి. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి కుమారుడు బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. చాలా రోజుల పాటు ఆస్పత్రికే పరిమితమయ్యాడు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. కన్నవారికి అంతులేని విషాదాన్ని మిగిల్చాడు. పాలకొండకు చెందిన ఓ నేత కుమారుడు అప్పట్లో ఇదే విధంగా బైక్ ప్రమాదానికి గురై చనిపోయాడు. తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదు. వాటికి వీలైనంత వరకూ దూరంగా ఉంచాలి. ఇటీవల సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది పిల్లలు బైక్ రైడింగ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. అందువల్లే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
కె.అశోక్‌మార్, సీఐ, రాజాం
----------------