ప్రగతి పట్టాలెక్కేనా?
ABN , Publish Date - May 11 , 2025 | 11:54 PM
Does acheve progress కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కలేదు. సంక్షేమ పథకాలూ అరకొరే. సాగుకు కీలకంగా ఉన్న ప్రాజెక్టుల పనులూ సాగడం లేదు. జూట్, ఫెర్రో పరిశ్రమలు అయోమయంలోనే ఉన్నాయి. చాలా ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితిలో సోమవారం జరుగనున్న జిల్లా సమీక్ష సమావేశంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
ప్రగతి పట్టాలెక్కేనా?
ఇంకా తెరుచుకోని పరిశ్రమలు
మెరుగుపడని రహదారులు
నత్తనడకన అభివృద్ధి పనులు
నేడు జిల్లా సమీక్ష సమావేశం
హాజరుకానున్న మంత్రి అనిత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కలేదు. సంక్షేమ పథకాలూ అరకొరే. సాగుకు కీలకంగా ఉన్న ప్రాజెక్టుల పనులూ సాగడం లేదు. జూట్, ఫెర్రో పరిశ్రమలు అయోమయంలోనే ఉన్నాయి. చాలా ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితిలో సోమవారం జరుగనున్న జిల్లా సమీక్ష సమావేశంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి పరిస్థితులు, అవసరాలు, అభివృద్ధిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు.
విజయనగరం/ కలెక్టరేట్, మే 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జూట్, ఫెర్రో అల్లాయూస్, చక్కెర పరిశ్రమలు ఆరేళ్ల కిందట ఓ వెలుగు వెలిగాయి. గత పాలకుల తీరుతో సంక్షోభంలో పడ్డాయి. తొలుత జూట్ పరిశ్రమలు, తరువాత చక్కెర కర్మాగారాలు, అటు తరువాత ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు వీధినపడ్డారు. పరోక్షంగా అంతకుమించిన సంఖ్యలో నష్టపోయారు. ఇందులో జనపనార, చక్కెర కర్మాగారాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు. వీటిపై ఆధారపడిన కార్మికులు వేలాది మందికి ఉపాధి దూరమైంది. లక్షలాది మంది రైతులకు సైతం ఇబ్బందికరంగా మారింది.
- రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి విజయనగరం జిల్లాలో గోగు 1.08 లక్షల ఎకరాల వరకూ సాగయ్యేది. పుష్కరకాలం కిందట 30 వేల ఎకరాలకు పడిపోయింది. ఇప్పుడు పూర్తిగా పంట కనుమరుగైంది. ఉమ్మడి జిల్లాలో బొబ్బిలి, రాజాం, సాలూరు ప్రాంతాల్లో 20 వరకూ పరిశ్రమలు మూతపడ్డాయి. అటు రైతులు పంట పండించడం లేదు.
- ఫెర్రో పరిశ్రమలదీ అదే తీరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 ఉండేవి. అందులో సగం మూతపడ్డాయి. మరికొన్ని ఉత్తరాధి రాష్ట్రాలకు తరలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.
- జిల్లాలో రెండు చక్కెర పరిశ్రమలు సహకార రంగంలో నడిచేవి. సీతానగరం ఎన్‌సీసీ ప్రైవేటుపరం అయ్యింది. వాటి ఆస్తుల విక్రయం కూడా జరిగిపోయింది. పూర్తిగా పరిశ్రమ మూతపడింది. భీమసింగి కర్మాగారం ఆధునీకరణ పేరుతో నిలిపివేసి ఏళ్లు గడుస్తోంది. వీటిలో పనిచేసే 12 వేల మంది కార్మికులు వీధినపడ్డారు. సంతకవిటిలో ఉన్న చెరకు పరిశ్రమ కూడా ముందుకు సాగడం లేదు. చెరకు సాగు తగ్గి లక్షలాది మంది రైతులకు పంట గిట్టుబాటు కావడం లేదు.
పూర్తిస్థాయిలో మెరుగుపడని రోడ్లు..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లు కొంత మెరుగుపడ్డాయి. ఇంకా మెరుగుపడాల్సి ఉంది. జిల్లాలో తగరపువలస-విజయనగరం-రాజాం రహదారి ప్రధానమైనది. గత ఐదేళ్లలో కనీస నిర్వహణ లేక దారుణంగా మారింది. దీనిని పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో విజయనగరం-పార్వతీపురం, చిలకపాలెం-పార్వతీపురం రోడ్లు సైతం దారుణంగా మారాయి. వాటిని సైతం పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. చీపురుపల్లి రైల్వేవంతెన, పారాది వంతెన, సీతానగరం వంతెనలను పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. నగరంలోని ఎత్తుబ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ సబ్ వే నిర్మాణం జరుగుతుందని, గతంలో ప్రణాళికలు తయారు చేశారు కాని కార్యరూపం దాల్చలేదు. పట్టణంలోని జమ్మునారాయణపురం నుంచి డెంకాడ మండలం నాతవలస వరకూ రహదారి విస్తరిస్తే భోగాపురం ఎయిర్‌పోర్టుకు చాలా ఉపయోగపడుతుంది.
గిరిజన యూనివర్సిటీ ఎప్పుడో?
గిరిజన యూనివర్సిటీ అనేది పుష్కరకాలంగా నిర్మించలేకపోవడం జిల్లా ప్రజల దురదృష్టకరం. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అప్పట్లో గిరిజన యూనివర్సిటీని కేటాయించారు. తొలుత శృంగవరపుకోట నియోజకవర్గంలోని రెల్లిలో స్థల ఎంపికను పూర్తిచేశారు. 500 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు 2014లోనే సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీని దత్తిరాజేరు-మెంటాడ మండలాల్లోని సరిహద్దు ప్రాంతాలకు మార్చింది. టీడీపీ ప్రభుత్వం ఎంపికచేసిన స్థలంలోనే పనులు పూర్తిచేసి ఉంటే కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుతం 519 ఎకరాల్లో పనులు మళ్లీ ప్రారంభించారు. ఇక్కడే కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వీటి పనులు శరవేగంగా జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దీనిపై సమావేశంలో నేతలు చర్చించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
విద్య, వైద్యరంగాల్లోనూ వెనుకబాటు
విద్య, వైద్యరంగం అభివృద్ధి చెందితేనే ఆశించిన ఫలాలు దక్కుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కాలేజీ నిర్మాణం నత్తనడకగా సాగుతోంది. దీనివల్ల జీజీహెచ్‌కు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సపోర్టు స్టాఫ్ లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక్కడ గ్యాస్ట్రాలాజీ నిపుణులు లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు విద్యాపరంగా మరింత వసతులు మెరుగుపడాలి. జిల్లా కేంద్రంలో జెఎన్‌టీయూలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో పాఠశాలల్లో చేపట్టిన నాడు -నేడు పనులు పూర్తిస్థాయిలో జరగలేదు.
అధికంగా రెవెన్యూ సమస్యలు
జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబరు 30న జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్యక్షతన నిర్వహించిన డీఆర్‌సీలో వివిధ భూ సమస్యలను ప్రస్తావించారు. ఫ్రీహోల్ట్ పట్టాలకు సంబంధించి సుమారు 490 ఎకరాల వరకూ అవకతవకలు జరిగినట్లు తేలిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో అమె వెల్లడించారు. ఇప్పటివరకూ దీనిపై ఎటువంటి కదలిక లేదు. వెబ్‌ల్యాండ్‌లో రైతులు పేర్లు మారిపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయాల్లో కంపూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో పేర్ల మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తహసీల్దార్లకు చెందిన డిజిటల్ సిగ్నేచర్ కీ వీరి వద్ద ఉండటంతో ఇటువంటి సంఘటలు చోటు చేసుకుంటున్నాయని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. కాగా భూముల రీ సర్వేకు సంబంధించి రోవర్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. గత వైసీపీ హయంలో జిల్లాకు 202 రోవర్లు కేటాయించారు. వీటిలో 60రోవర్లు పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో రోవర్లు లేక గ్రామ సర్వేయర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ దిశగా జిల్లా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సాగునీటి ప్రాజెక్టులదీ అదే తీరు..
సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఇదే మంచి సమయం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 19,85,221 ఎకరాల ఆయకట్టుకుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభంలో రూ.1127.58 కోట్లతో పాలనా అనుమతి లభించింది. ఇప్పటివరకూ రూ.900 కోట్ల వరకూ వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయినా ఏటా ఖరీఫ్‌లో 80 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం గగనంగా మారింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బడ్జెట్ కేటాయింపులు రూ.655.19 కోట్లు చేసినా.. ప్రభుత్వం కేవలం రూ.61.82 కోట్లు మాత్రమే విడుదల చేయగలిగింది. కనీసం ఏడాదికి రూ.100 కోట్లు బడ్జెట్ నిధులు విడుదల చేసినా.. ప్రధాన పనులు పూర్తిచేసేవారమని యంత్రాంగం చెబుతోంది. చివరకు కాంట్రాక్టర్‌కు సైతం రూ.6 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
కదలిక లేని తారకరామతీర్థ సాగర్
తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుదీ దయనీయ పరిస్థితే. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇంకా కాంట్రాక్టర్‌కు రూ.18 కోట్లు వరకూ బకాయిలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.739 కోట్లకు సంబంధించి పాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకూ రూ.310 కోట్ల వరకూ పనులు మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది. రూ.429 కోట్ల వరకూ పనులు చేయాల్సి ఉంది. కనీసం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.100 కోట్లు విడుదల చేసినా పెండింగ్ పనులు పూర్తయ్యేవి. అధికారులు చేసిన ప్రతిపాదనలను జగన్ సర్కారు బుట్టదాఖలు చేసింది. మరోవైపు నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. 300 ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉన్నా. దాని జోలికి పోలేదు.