Share News

వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:25 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు హెచ్చరించారు.

    వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి
గర్భిణులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కరరావు

- లేదంటే చర్యలు తప్పవు

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కరరావు

గరుగుబిల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు హెచ్చరించారు. బుధవారం గరుగుబిల్లి, గొట్టివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీల పరిధిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా అవగాహన కల్పించాలి. ఆరోగ్యశాఖ నిర్దేశించిన ప్రత్యేక యాప్‌లను పూర్తిస్థాయిలో అమలు పర్చాలి. యాప్‌లకు సంబంధించి సిబ్బంది తగిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. వైద్య సేవలు, తల్లిపాలు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ-ఆశా యాప్‌లో ఆరోగ్య వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలి.’ అని అన్నారు. పీఎంజేవై, పీఎంఏఏవై, ఎన్‌సీడీసీడీ, ఎనిమియా యాక్షన్‌, తదితర పలు విషయాలపై చర్చించారు. గొట్టివలసలో నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌బీఎస్‌కే కార్యాలయ అధికారి డాక్టర్‌ తెర్లి జగన్మోహన్‌రావు, డాక్టర్‌ ఎన్‌ఎంకే తిరుమలప్రసాద్‌, వైద్య సిబ్బంది జగదీశ్వరి, ఉదయకుమారి, డి.మృత్యుంజయరావు, పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:25 AM