Share News

Submit Petitions? వినతులు ఇచ్చేందుకు పిల్లలను వెంటబెట్టుకొస్తారా?

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:38 PM

Do You Bring Children Along to Submit Petitions? వినతులు ఇచ్చేందుకు పిల్లలను వెంటబెట్టుకొస్తారా? వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. విద్యార్థులను పాఠశాలలకు పంపించకుండా తల్లిదండ్రులతో కలిసి పీజీఆర్‌ఎస్‌కు తీసుకొచ్చిన ఓ వ్యక్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Submit Petitions? వినతులు ఇచ్చేందుకు పిల్లలను వెంటబెట్టుకొస్తారా?
పిల్లలను పీజీఆర్‌ఎస్‌కు తెచ్చిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌

  • ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌

పార్వతీపురం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వినతులు ఇచ్చేందుకు పిల్లలను వెంటబెట్టుకొస్తారా? వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. విద్యార్థులను పాఠశాలలకు పంపించకుండా తల్లిదండ్రులతో కలిసి పీజీఆర్‌ఎస్‌కు తీసుకొచ్చిన ఓ వ్యక్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడి విషయమై ఇటీవల బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వారు తిరుగుపయనమైన సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై క్షతగాత్రులుగా మారారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్‌కు పిల్లల్ని తీసుకొచ్చిన వారిపై కలెక్టర్‌ మండిపడ్డారు. వీరఘట్టం మండలం బెజ్జి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకొని సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. తమ గ్రామం నుంచి తలవరం వెళ్లేందుకు పిల్లలకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. తమ ఊరిలోనే మూడు నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహించాలని కోరారు. అయితే ఈ సమస్య చెప్పేందుకు పిల్లలను ఎందుకు వెంటబెట్టుకుని వచ్చారని కలెక్టర్‌ ప్రశ్నించారు. తల్లిదండ్రులు లేదా గ్రామస్థులెవరైనా వచ్చి సమస్యను చెబితే పరిష్కరిస్తాం కదా! అని తెలిపారు. సుదూర గ్రామాల నుంచి పిల్లలను తీసుకుని వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావడం ఎంతవరకు సమంజమన్నారు. మార్గమధ్యంలో వారికి ఏదైనా జరిగితే పరిస్థితేమిటని అడిగారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. ఇకపై పిల్లలను కలెక్టరేట్‌కు తీసుకురావొద్దని, తప్పనిసరిగా పాఠశాలకే పంపించాలని సూచించారు. కాగా ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు.

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం..

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనమవుతుందని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు కుటుంబాలు, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఆర్థికంగా కూడా ఇబ్బందులు తప్పవు. వాటి అనర్థాలపై అవగాహన అవసరం. ప్రతిఒక్కరూ యోగా , వ్యాయామంపై దృష్టి సారించాలి. పాఠశాలలు, వసతిగృహాల చుట్టుపక్కల ఎటువంటి విక్రయాలు, కార్యకలాపాలు జరగకుండా పటిష్ఠ నిఘా పెట్టాలి. ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలి. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని సారా కేంద్రాలపై దాడులు జరపాలి. వివిధ రూపాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు సాగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి. దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా ప్రజలు 1972 నెంబర్‌కు ఫోన్‌ చేయాలి.’ అని తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణాధికారి దుర్గా ప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ కె.సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:38 PM