Do not leave the helmet హెల్మెట్‌ను వీడొద్దు
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:38 PM
Do not leave the helmet హెల్మెట్ శిరోధార్యం.. హెల్మెట్ ధరించండి కుటుంబాన్ని కాపాడండి.. హెల్మెట్‌తో ప్రయాణం భద్రం.. అంటూ పోలీసులు తరచూ మొత్తుకుంటున్నా ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. అందరూ హెల్మెట్ ధరించడం లేదు.
హెల్మెట్‌ను వీడొద్దు
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
నాలుగు రోజుల క్రితం ముగ్గురి మృతి
మైనర్లకు బైకులిస్తున్న తల్లిదండ్రులు
- ఈ నెల 18న బొండపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నేలబావిలో స్నానం చేసేందుకు పక్క ఊరుకు బైక్‌పై బయలుదేరిన కొద్దిసేపటికే వాహనం చెట్టుకు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. ముగ్గురిదీ రెండు పదుల వయసే. హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయారు.
- మే 16న డెంకాడ మండలం మోదవలస వద్ద జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలై ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. రాకోడు గ్రామానికి చెందిన ఆ యువకులు హెల్మెట్ ధరించకపోవడంతోనే విలువైన ప్రాణాలు కోల్పోయారు.
రాజాం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
హెల్మెట్ శిరోధార్యం.. హెల్మెట్ ధరించండి కుటుంబాన్ని కాపాడండి.. హెల్మెట్‌తో ప్రయాణం భద్రం.. అంటూ పోలీసులు తరచూ మొత్తుకుంటున్నా ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. అందరూ హెల్మెట్ ధరించడం లేదు. కొందరు పోలీసు తనఖీలకు భయపడి బయటకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్తున్నప్పటికీ బండి వెనుక లాక్ చేసి ఉంచుతున్నారు. ప్రధానంగా యువకులు ‘మనకేం కాదులే’ అని నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో వీరే అధికంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. అయినా తన వరకూ వస్తే గాని అర్థం చేసుకోలేకపో తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అర్థమైనా ఉపయోగం ఉండదు.
జిల్లాలో కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లాడు మారం చేశాడానో.. అలుగుతున్నాడనో పెద్దవారు బైక్‌లు కొనిచ్చి చేతిలో పెడితే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల పల్లెల్లో సైతం పట్టణ సంస్కృతి విస్తరిస్తోంది. ప్రతి ఇంటా ద్విచక్ర వాహన వినియోగం పెరుగుతోంది. మైనర్లు సైతం బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు. వారిని కుటుంబసభ్యులు నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో వారికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. విద్యార్థులు, మైనర్లు సైతం రయ్ రయ్ మంటూ బైక్‌లపై స్వైర విహారం చేస్తున్నారు. తోటి ప్రయాణికుల్లో సైతం ఆందోళనకు కారణమవుతున్నారు. ప్రజల్లో అలజడి రేపుతున్నారు.
కేసులు నమోదు చేస్తున్నా..
జిల్లాలో ఇటీవల ఏదోచోట ప్రమాదం జరుగుతునే ఉంది. హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఏకంగా 60వేల వరకూ కేసులు నమోదుచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. 2022లో జరిగిన ప్రమాదాల్లో 244 మంది మృతిచెందారు. 925 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 213 మంది చనిపోతే 826 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 166 మంది మృతిచెందితే 695 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో దాదాపు 100 మంది వరకూ చనిపోయి ఉంటారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. ద్విచక్ర వాహన ప్రమాదాలకు సంబంధించి ఎక్కువగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాపాయం కలుగుతోంది.
- చాలామంది తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టిసారించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదాలు జరిగి మూల్యం చెల్లించుకున్న తరువాత అయ్యో పాపం అని బాధపడుతున్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనం ప్రతి ఇంటికి అవసరమే. కానీ పిల్లలు కోరిందే తడవుగా స్పోర్ట్స్ బైక్‌లు కొనిచ్చేస్తున్నారు. తరువాత పిల్లలపై దుష్ట్రభావం పడుతోంది. చెడు సావాసాలు పెరుగుతున్నాయి. బైక్ రేసింగ్, మందు తాగి డ్రైవింగ్ చేయడం వంటి వాటితో వారు మూల్యం చెల్లించుకుంటున్నారు.
ఇప్పటికే అమలు
మార్చి 1 నుంచి హెల్మెట్ ధారణకు సంబంధించి కీలక ఆదేశాలు వచ్చాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో కఠిన నిబంధనలు, జరిమానాలు అమల్లోకి వచ్చాయి. అయినా సరే వాహనదారుల్లో మార్పురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి1 కంటే ముందు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.135 జరిమానా వేసేవారు. ఇప్పుడు రూ.1000 కట్టాల్సిందే. లైసెన్స్ లేకుండా బండి నడిపితే రూ.10 వేలు వసూలు చేస్తారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగితే కేసులు నమోదుచేస్తారు. 90 రోజుల్లో జరిమానా కట్టకపోతే బండి సీజ్ చేస్తారు. గత నాలుగు నెలల్లో హెల్మెట్ ధరించని వారిపై నమోదైన కేసులు 1329, లైసెన్స్ లేనివారు 1437 మందిపై కేసు నమోదుచేసినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
నిబంధనలు పాటించాలి
వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఇక నుంచి హెల్మెట్ అనేది తప్పనిసరి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోవాలి. కార్లుపై వెళ్లేవారు షీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, జైలుశిక్ష తప్పదు. ప్రజల బాగుకోసమే ఈ ప్రయత్నం. ట్రాఫిక్ నిబందనలు తప్పనిసరిగా పాటించాలి.
కె.అశోక్‌కుమార్, సీఐ, రాజాం
---------------------