Share News

రుద్రభూమినీ వదలరా?

ABN , Publish Date - May 01 , 2025 | 12:20 AM

Do not leave Rudrabhoomi? రుద్రభూమినీ వదలరా? కబ్జాకు కాదేదీ అనర్హం అనుకున్నారో.. ఒకరిని చూసి ఒకరు తామెందుకు ఆక్రమించకూడదనుకున్నారో... ఆక్రమిస్తే తప్పేంటని భావించారో.. ప్రభుత్వ స్థలమే కదా అడిగేదెవరని తెగించారో కానీ శ్మశానంపై పడ్డారు. కొన్నాళ్లుగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆక్రమిస్తూ వచ్చారు.

రుద్రభూమినీ వదలరా?
చీపురుపల్లి రామాంజనేయ కాలనీ శ్మశానవాటిక

రుద్రభూమినీ వదలరా?

చీపురుపల్లి రామాంజనేయ కాలనీ శ్మశానవాటిక స్థలం కబ్జా

మూడెకరాల్లో మిగిలింది 22 సెంట్లే

ఆక్రమిత స్థలాల్లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు

కర్మకాండల నిర్వహణకు ఇబ్బందులు

కబ్జాకు కాదేదీ అనర్హం అనుకున్నారో.. ఒకరిని చూసి ఒకరు తామెందుకు ఆక్రమించకూడదనుకున్నారో... ఆక్రమిస్తే తప్పేంటని భావించారో.. ప్రభుత్వ స్థలమే కదా అడిగేదెవరని తెగించారో కానీ శ్మశానంపై పడ్డారు. కొన్నాళ్లుగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆక్రమిస్తూ వచ్చారు. మూడెకరాల్లో ఉన్న రుద్రభూమిని 22 సెంట్లకు తీసుకొచ్చారు. ఆక్రమిత స్థలాల్లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టేశారు. చీపురుపల్లి రామాంజనేయ కాలనీ శ్మశాన వాటిక దయనీయ పరిస్థితిది. కబ్జాదారుల్లో బడాబాబులు ఉండడం గమనార్హం. కర్మకాండల నిర్వహణకు వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్మశానం పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు.

చీపురుపల్లి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి):

గెడ్డలు, వాగులు, రోడ్ల పక్కనున్న ఖాళీ స్థలాలు, చెరువు గట్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్న కబ్జాదారులు చివరికి రుద్రభూమిని కూడా వదిలిపెట్టడం లేదు. ఖాళీగా ఉందని కన్నేసి కొట్టేస్తున్నారు. చీపురుపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న రామాంజనేయ కాలనీ శ్మశాన వాటికకు ఇప్పుడు అదే గతి పట్టింది. సర్వే నం.42, 43లో సుమారు మూడు ఎకరాల స్థలాన్ని మరుభూమి కోసం కేటాయించారు. వందల యేళ్ల నుంచి ఇక్కడ శ్మశానం కొనసాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో పరిసర పాంతాలకు చెందిన పలువురు ఆక్రమణల పర్వానికి తెర తీశారు. సుమారు 1.49 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించగా, 1.58 ఎకరాలను ఆయా వర్గాలు ఆక్రమించుకున్నాయి. ఆక్రమిత స్థలంలో కొంతమంది పేదలు పూరిపాకలు నిర్మించుకున్నారు. చాలా మంది వ్యాపార సంస్థలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది చిన్నచిన్న మెకానిక్‌ షెడ్లు నిర్మించారు. ఆక్రమణదారుల్లో పేదలతో పాటు బడా బాబులు కూడా ఉన్నారు. దీంతో మూడెకరాల్లో ఉండాల్సిన శ్మశాన వాటిక స్థలం ఇప్పుడు కేవలం 22 సెంట్లకు పడిపోయింది. ఈ క్రమంలో అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత నిధులు సుమారు రూ.నాలుగు లక్షలు వెచ్చించి, మిగిలి ఉన్న 22 సెంట్ల భూమికి ప్రహరీ, అంత్యక్రియల కోసం ఓ షెడ్డు నిర్మించారు. స్నానపు గదులు నిర్మించాల్సి ఉంది. వాస్తవానికి ఇప్పుడున్న 22 సెంట్లు చాలడం లేదు. శ్మశానంలో అదనపు నిర్మాణాల ప్రతిపాదన కూడా ముందుకు సాగడం లేదు. 2019లో కొవిడ్‌ విజృంభించిన సమయంలో ఏకకాలంలో పలువురు మృత్యువాత పడడంతో కర్మకాండల నిర్వహణకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

వాస్తవ విస్తీర్ణం ఎంత

రామాంజనేయ కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటికకు సర్వే నం.42, 43లోని గుట్ట ప్రాంతంలో 3.2 ఎకరాల స్థలం ఉంది. పట్టణంలోని అత్యధికంగా ఉన్న వైశ్య కుటుంబాలు, రామాంజనేయ కాలనీ వాసులు, ఆంజనేయపురం, మెయిన్‌ రోడ్డులోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారు ఈ శ్మశాన వాటికనే వినియోగిస్తారు. ఈ స్థలానికి ఆనుకొని 1999లో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మించారు. ఆ సమయంలో అవే సర్వే నంబర్ల పరిథిలో కొంత స్థలాన్ని ఆర్టీసీ సంస్థ తీసుకుంది. మండల పరిషత్‌ కార్యాలయం వెనుక వైపున సర్వే నం.42/2డీలో ప్రభుత్వానికి అవసరమైన వెల్‌నెస్‌ సెంటరు నిర్మాణం కూడా జరిగింది. కొత్తగా నిర్మించిన నీళ్ల ట్యాంకులు, సంప్‌, సంబంధిత షెడ్లు కూడా ఆ స్థలంలోనే ఉన్నట్టు రికార్డులు చూపుతున్నాయి. సంత మార్కెట్‌ నుంచి రామాంజనేయ కాలనీ మీదుగా, వంగపల్లిపేటకు వేసిన సీసీ రోడ్డు సర్వే నం.43/27జే లోనే ఉంది. సర్వే నం.42/2ఈ లో ఉన్న సుమారు 53 సెంట్ల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఏకంగా ప్రహరీ నిర్మించేశారు. ఇలా ప్రైవేటు వ్యక్తులు ఎవరికి వారే ఆక్రమించుకోవడం, మరికొంత భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడంతో శ్మశాన స్థలం కుచించుకుపోయింది. ఇటీవల మండల పరిషత్‌ నిధులతో బోరు తవ్వించారు. అదే గ్రాంటుతో టైల్స్‌ కూడా వేయిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా శ్మశానికి స్థల సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని అదనపు స్ధలాన్ని కేటాయించాలని లేకుంటే ఇతరుల ఆక్రమణలో ఖాళీగా ఉన్న స్థలాన్ని శ్మశానికి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

శ్మశానాన్ని ఆక్రమించకూడదు

శ్మశానం కోసం కేటాయించిన స్థలాల్లో ఆక్రమణలు ఉండకూడదు. సర్వే నం.42, 43లో సర్వే నిర్వహించాం. ఆక్రమణలున్న మాట వాస్తవమే. ఆక్రమణదారుల్ని గుర్తించడం కూడా జరిగింది. వారికి త్వరలోనే నోటీలు ఇస్తాం. అవి తొలగించిన తరువాత ఆ భూమి శ్మశానానికే చెందుతుంది.

- ఎన్‌.రాజారావు, తహసీల్దారు, చీపురుపల్లి.

Updated Date - May 01 , 2025 | 12:21 AM