Share News

Do not grab our lands మా భూములను లాక్కోవద్దు

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:09 AM

Do not grab our lands శాఖ జిల్లా పెందుర్తి నుంచి జిల్లాలోని శృంగవరపుకోట మండలం బౌడారా వరకు ఉన్న విశాఖ-అరకు రోడ్డు (516బి)ను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి(పోలవరం ఎడమ) కాలువ నిర్మాణానికి భూ సేకరణ జరుగుతోంది.

Do not grab our lands మా భూములను లాక్కోవద్దు
భూసేకరణ సర్వే చేస్తున్న గ్రామ రెవేన్యూ అధికారులను అడ్డుకుంటున్న ఎస్‌.కోట శివారు సీతంపేట రైతులు(ఫైల్‌)

మా భూములను లాక్కోవద్దు

రోడ్డు, కాలువకు భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు

జీవనాధారం ఏంటని నిలదీత

నష్టపరిహారంపైనా అసంతృప్తి

ధరపై స్పష్టత ఇవ్వని అధికారులు

- మా భూముల్లో సర్వే చేయొద్దు. ఒక వైపు పెందుర్తి-బౌడారా(516బి) రోడ్డు బైపాస్‌కు భూములు తీసుకుంటున్నారు. మరో వైపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ నిర్మాణానికి భూమి లాక్కొంటున్నారు. మాకు ఎకరం, రెండెకరాల లోపే భూములున్నాయి. వీటిని కూడా అభివృద్ది పేరిట తీసుకుంటే వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న మా పరిస్థితి ఏంటి?

- సీతంపేట గ్రామ పరిధిలో ఇటీవల భూసేకరణ సర్వే కోసం వెళ్లిన ఎస్‌.కోట గ్రామ రెవెన్యూ అధికారులను అడ్డగించిన రైతులు

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లా పెందుర్తి నుంచి జిల్లాలోని శృంగవరపుకోట మండలం బౌడారా వరకు ఉన్న విశాఖ-అరకు రోడ్డు (516బి)ను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి(పోలవరం ఎడమ) కాలువ నిర్మాణానికి భూ సేకరణ జరుగుతోంది. ఈ రెండింటికీ దాదాపుగా 400 ఎకరాల వరకు అవసరమని గుర్తించారు. కాగా పెందూర్తి-బౌడారా రోడ్డు విస్తరణకు నిర్మిచాలను కున్న బైపాస్‌ రోడ్డు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ నిర్మాణ పనులు కొత్తూరు, శృంగవరపుకోట గ్రామాల భూముల్లో సమాంతరంగా జరగనున్నాయి. అయితే ఈ గ్రామాల పరిధిలో ఉన్న రైతుల భూములు ఒకే కుటుంబానికి చెందిన వారివి ఉన్నాయి. వీరంతా అర ఎకరా నుంచి ఒకటెండ్రు ఎకరాలున్న కుటుంబాలు కావడం.. ఆ భూమంతా భూసేకరణలో కోల్పోతుండడాన్ని తట్టుకోలేకపో తున్నారు. భూమిని వదులు కొనేందుకు ఇష్ట పడడం లేదు. విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని, సమీపంలో ఉన్న భూములు కావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎకరాకు కోట్లలో సొమ్మును ఆశ చూపినప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతులు భూములను అమ్మలేదు. వారసులకు అస్తిగాను చూపిస్తున్నారు. ఇలాంటి భూములను ఇప్పుడు ప్రభుత్వం లాక్కొంటుండంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. భూసేకరణ జరగకుండా చూస్తామని ఎవరు చెప్పినా వారి వెంట నడుస్తున్నారు. ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెలుతున్నారు. అధికారులు మాత్రం ప్రజా అవసరాల కోసం భూమిని తీసుకుంటామని, ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లిస్తామని చెబుతున్నారు.

పరిహారంపై స్పష్టత కరువు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదైన మార్కెట్‌ విలువను బట్టి వ్యవసాయ భూములకు సెంట్లు లెక్కన, వ్యవసాయోతర భూములకు గజాల లెక్కన నష్టపరిహారం చెల్లింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకటిన్నర రెట్లని కొంత మంది అధికారులు, రెండున్నర రెట్లని మరి కొంత మంది అధికారులు చెబుతున్నారు. రైతులతో జరుపుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు ఆర్డీవో కార్యాలయం నుంచి వస్తున్న అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్కో గ్రామానికి ఒక్కో మార్కెట్‌ విలువ ఉంది. ఉదాహరణకు శృంగవరపుకోట గ్రామంలో సెంటు రూ.18,000, గజం రూ.3000 ఉంది. జెడ్‌ కుమరాంలో సెంటు రూ.8000, గజం రూ.800 ఉందంటున్నారు. స్థానిక అధికారులు చెబుతున్న నష్టపరిహారం బట్టి శృంగవరపుకోటలో సెంటుకు రూ.45000, గజం స్థలంపై రూ.7,500 వస్తుంది. జెడ్‌ కుమరాం రైతులకు సెంటుకు రూ.20,000, గజం స్థలంపై రూ.2,000 అందుతుంది. ఈ భూములు ప్రైవేటు మార్కెట్‌లో ఇంతకు పది రెట్లు ధరలు పలుకుతున్నాయి. కలెక్టర్‌ అంబేడ్కర్‌తో జరిగిన సమావేశంలో ప్రభుత్వ మార్కెట్‌ రేటుకు మూడున్నర రెట్లు నష్టపరిహారం అందిస్తామని చెప్పినట్లు సీఐటీయూ నాయకుడు మద్దిల రమణ చెబుతున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:09 AM