Do Not Come Here ఇక్కడకు రావొద్దు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:14 AM
Do Not Come Here ఆంధ్రా-ఒడిశా సరిహద్దు.. వివాదాస్పద కొఠియా గ్రామమైన గంజాయిభద్రలో శుక్రవారం సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. ఆంధ్రా అధికారులు ఇక్కడ విధులు నిర్వహించడానికి వీలు లేదన్నారు. వెంటనే వైద్యశిబిరాన్ని ఎత్తివేయాలని హుకుం జారీచేశారు.
వెనుతిరిగిన తోణాం పీహెచ్‌సీ సిబ్బంది
మక్కువ రూరల్, నవంబరు14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు.. వివాదాస్పద కొఠియా గ్రామమైన గంజాయిభద్రలో శుక్రవారం సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. ఆంధ్రా అధికారులు ఇక్కడ విధులు నిర్వహించడానికి వీలు లేదన్నారు. వెంటనే వైద్యశిబిరాన్ని ఎత్తివేయాలని హుకుం జారీచేశారు. గంజాయిభద్ర, పట్టుచెన్నూరు సచివాలయాలు ఒడిశాలోని పొట్టంగి బ్లాక్ పరిధిలో ఉన్నాయ న్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఆంధ్రా అధికారులు విధులు నిర్వహించడం సరికాదని బీడీవో, ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు అన్నారు. అయితే అక్కడున్న గిరిజనులు మాత్రం తోణాం పీహెచ్‌సీ వైద్యశిబిరానికి మద్దతు తెలిపినట్లు తెలిసింది. సుమారు 20మంది వైద్యసేవలు పొందేందుకు ముందుకు రాగా ఒడిశా అధికారులు ససేమిరా అనడంతో గిరిజనులు ఇంటి బాట పట్టారు. మరోవైపు తోణాం పీహెచ్‌సీ వైద్యాధికారి అజయ్, తన వైద్య సిబ్బందితో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా ఆ సమయంలో గంజాయిభద్ర, పట్టుచెన్నూరు సర్పంచులు తోణాం వైద్య సిబ్బందికి ఎటువంటి సహకారమందించలేదు. ఏదేమైనా తరచూ కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారులు ఇలా వ్యవహరించడం పరిపాటిగా మారింది. దీనిపై ఇరు రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాఽధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.