Diwali pungal దీపావళి శోభ
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:23 AM
Diwali punjal జిల్లాలో దీపావళి శోభ ఉట్టిపడుతోంది. యువకులు, పెద్దలు బాణసంచా దుకాణాలకు బారులు తీరుతున్నారు. సమయం లేకపోవడంతో ఆదివారం భారీ స్థాయిలో మందుగుండును కొనుగోలు చేశారు. మార్కెట్‌లో కొత్తగా దిగిన మతాబులు, బాంబులు, తారాజువ్వలను కొనడం కనిపించింది.
దీపావళి శోభ
రద్దీగా విజయనగరం మార్కెట్
కొనుగోలుదారులతో బాణసంచా దుకాణాలు కిటకిట
షాపుల వద్ద కానరాని నిబంధనలు
జీఎస్టీ పేరుతో పేలిన ధరలు
విజయనగరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి)
జిల్లాలో దీపావళి శోభ ఉట్టిపడుతోంది. యువకులు, పెద్దలు బాణసంచా దుకాణాలకు బారులు తీరుతున్నారు. సమయం లేకపోవడంతో ఆదివారం భారీ స్థాయిలో మందుగుండును కొనుగోలు చేశారు. మార్కెట్‌లో కొత్తగా దిగిన మతాబులు, బాంబులు, తారాజువ్వలను కొనడం కనిపించింది. ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తాత్కాలిక బాణాసంచా దుకాణాలు కూడా భారీగా ఏర్పాటయ్యాయి. ఒక్క విజయనగరం కేఎల్‌పురంలోనే పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. మండల కేంద్రాల్లో, ముఖ్య పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో రెండు, మూడు చొప్పున తాత్కాలిక షాపులు వెలిశాయి. అయితే తాత్కాలిక దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. షాపునకు, షాపునకు మధ్య 15 మీటర్ల దూరం ఉండాలి. విజయనగరంతో పాటు బొబ్బిలిలో ఆ నిబంధన పాటించడం లేదు. అటు కేఎల్‌పురంలో పదుల సంఖ్యలో షాపులు ఉండగా అక్కడ అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయలేదు. శనివారం ఈ దుకాణాలను పరిశీలించిన ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అగ్నిమాపక వాహనాలను ఏర్పాటుచేయాలని ఆదేశించడంతో అప్పటికప్పుడు రెండింటిని తీసుకొచ్చారు. అవి ఆదివారం కనిపించలేదు. షాపులను రోడ్డుకు దూరంగా ఉంచాలని స్థానికులు కోరినా ఫలితం లేకపోయింది. 23వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు.
- బాణసంచాపై జీఎస్టీ తగ్గించకపోవడంతో దానిని సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లైసెన్స్ నంబర్, టిన్ నంబర్‌తో ఉన్న రశీదుపై బిల్లులు ఇవ్వాలి. కానీ తెల్ల కాగితంపై రాసి ఇచ్చి పంపుతున్నారు. ఏడాది పొడవునా లైసెన్స్ దుకాణాల ద్వారా రూ.5 కోట్ల విక్రయాలు జరిగితే.. పండుగ సమయంలో రూ.15 కోట్ల వరకూ అమ్మకాలు సాగుతాయని అంచనా. ఇలా చూస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
--------------