Sanitation జిల్లాకేంద్రం.. పడకేసిన పారిశుధ్యం
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:48 PM
District Headquarters.. Sanitation in Shambles జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్డెక్కుతోంది. ఎక్కడికక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. అధికారులు, పాలకవర్గం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడికక్కడే నిలిచిపోతున్న మురుగునీరు
దోమల స్వైరవిహారం.. వ్యాధులు ప్రబలే ప్రమాదం
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన అధికారులు, పాలకవర్గం
పార్వతీపురం టౌన్, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్డెక్కుతోంది. ఎక్కడికక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. అధికారులు, పాలకవర్గం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేయడంపై మున్సిపాల్టీవాసులు మండి పడుతున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకముందే పటిష్ఠ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా పారిశుధ్యం, మురుగునీటి మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- పార్వతీపురం మున్సిపాల్టీగా ఏర్పడి 60 ఏళ్లు అవుతుంది. గ్రేడ్-1 అప్‌గ్రేడ్ అయ్యి 25 ఏళ్లు కావస్తుంది. జిల్లా కేంద్రంగా మారి మూడేళ్లు గడుస్తుంది. అయినా పట్టణంలో పరిస్థితేమీ మారలేదు. మున్సిపాల్టీలో 30వార్డులు ఉండగా.. అధికారికంగా 55 వేల మంది జనాభా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా సుమారు 80వేల మందికి పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. ఆయా వార్డుల నుంచి రోజుకు సుమారు 15 నుంచి 20 టన్నుల వరకు చెత్తలు, వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. అయితే జనాభా సంఖ్యకు తగ్గట్టుగా పారిశుధ్య కార్మికులను నియమించడం లేదు. గత కొన్నేళ్లుగా 120 మంది లోపే పనిచేస్తున్నారు.
- సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీలతో పోల్చితే.. పార్వతీపురంలో పారిశుధ్య నిర్వహణ అనేది రోజు రోజుకూ అధ్వానంగా మారుతుంది. పట్టణంలో ఏ వార్డులో చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. కాలువల్లో పూడికలు తీయకపోవడంతో ఎక్కడిక్కడే మురుగునీరు నిలిచిపోతుంది. వేసవి కాలంలో ఆయా వార్డుల్లోని కాలువల్లో చేపట్టిన పూడిక తీత పనులను తూతూ మంత్రంగా చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా 30 వార్డుల్లోని మురుగునీరు వరహాల గెడ్డలోకి వెళ్తుంది. అయితే దానిలో కూడా వ్యర్థాలు, చెత్తలు పేరుకుపోవడంతో ఎక్కడిక్కడి నీరు నిలిచిపోతుంది. దోమల విజృంభణకు తోడు దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పార్వతీపురంలో ఆరేళ్ల కిందట చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమానికి కూడా అధికారులు మంగళం పాడేశారు. దీంతో ప్రజలకు దోమలు బెడత తప్పడం లేదు. తరచూ రోగాలపాలవుతూ.. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జ్వరాలు, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉంది. అయితే పారిశుధ్య నిర్వహణపై ఇప్పటికీ ప్రత్యేక కార్యచరణ రూపొందించక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి..
పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారులతో పాటు పాలకులు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.
- జి.గంగరాజు, గాంధీసత్రం వీధి, పార్వతీపురం
===================================
రోగాలపాలవుతున్నా..
పారిశుధ్యం నిర్వహణ గాడి తప్పడంతో మున్సిపాల్టీ వాసులు తరచూ రోగాలపాలవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరం.
- ఎస్. ఉమ, ప్రజా సంఘాల నాయకులు, కొత్తవీధి, పార్వతీపురం
===================================
శ్రద్ధ చూపుతున్నాం.
పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి మళ్లింపుపై శ్రద్ధ చూపుతున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను రూపొందిచాం. దీనిపై ప్రజారోగ్యశాఖాధికారులకు కూఏడా స్పష్టమైన ఆదేశాలిచ్చాం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
- సీహెచ్ వెంకటేశ్వర్లు, కమిషనర్, పార్వతీపురం మున్సిపాల్టీ