Cremation Land శ్మశానవాటిక స్థలంపై వివాదం
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:05 PM
Dispute Over Cremation Ground Land శ్మశానవాటిక స్థల వివాదం నేపథ్యంలో ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి.. మరోచోట పూడ్చిపెట్టారు. జియ్యమ్మవలస మండ లంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూడ్చిపెట్టిన మృతదేహం బయటకు తీసి.. వేరే చోట ఖననం
చింతలబెలగాంలో దళితుల నిరసన
జియ్యమ్మవలస, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్మశానవాటిక స్థల వివాదం నేపథ్యంలో ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి.. మరోచోట పూడ్చిపెట్టారు. జియ్యమ్మవలస మండ లంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
చింతలబెలగాంలోని సర్వే నెంబరు 46/1లో ఒకప్పుడు 2.60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. అయితే అది కబ్జాలకు గురైంది. ప్రస్తుతం 60 సెంట్ల విస్తీర్ణంలోనే చెరువు ఉంది. ఇందులో సెంటున్నర స్థలాన్ని దళితుల శ్మశానానికి వదిలేసి, మిగిలిన మొత్తాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు. కాగాగురువారం సాయంత్రం ఆ గ్రామానికి చెందిన బెలగాపు సాయమ్మ (60) అనే దళిత మహిళ మృతి చెందింది. శుక్రవారం శ్మశాన స్థలం పక్కనే కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. అయితే ఆ స్థలం తమదని ఆ గ్రామానికి చెందిన కొంతమంది తహసీల్దార్ ఎన్.అప్పారావు, ఎస్ పి.అనీష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తమ సిబ్బందితో చింతలబెలగాం చేరుకుని దళితులతో మాట్లాడారు. అనంతరం ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయించి.. మూడు అడుగుల దూరంలో వేరొక చోట పూడ్చిపెట్టించారు. దీంతో దళితులు నిరసన వ్యక్తం చేశారు. శ్మశాన స్థలాన్ని పూర్తిగా కబ్జాచేయడంతో తరచూ ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశామని, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాసి.. తద్వారా న్యాయం చేస్తా మని తహసీల్దార్ అప్పారావు తెలిపారు. దీంతో వారు శాంతించారు. శనివారం ఆర్‌ఐ సీతారామరాజు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. వివాదానికి తెర లేపిన స్థలంలో కొంతమంది సాగు చేసుకుంటున్నారని, అది ప్రభుత్వ భూమేనని తెలిపారు. కాగా సాగు చేసుకుంటున్న వారికి ఎటువంటి హక్కులు లేవన్నారు. కానీ ముగ్గురి ఫిర్యాదులను ప్రాథమికంగా స్వీకరించి.. ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి.. వేరొక చోట పూడ్చిపెట్టామని తెలిపారు. దీనిపై ఉన్నతాఽధికా రులకు పూర్తి నివేదికను అందజేస్తామన్నారు.