Share News

digging sand after sale పోగేసి.. అమ్మేసి

ABN , Publish Date - May 04 , 2025 | 11:43 PM

digging sand after sale ఇసుకపై నిఘా కొరవడింది. ఇంటి అవసరాలకు మాత్రమే ఉచితంగా ఇస్తున్న ఇసుకను అదే పేరుతో కొందరు దందా చేస్తున్నారు. అక్రమంగా తవ్వేసి ఓ చోట పోగేసి ఆపై అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు ఒకే బిల్లుపై అనేక సార్లు ఇసుకను పట్టుకుపోతున్నారు.

digging sand after sale పోగేసి.. అమ్మేసి
శ్రీరంగరాజపురం కల్లాల్లో ఇసుక నిల్వలు

పోగేసి.. అమ్మేసి

ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్న ఇసుక మాఫియా

ఓ చోట నిల్వ చేసి ఆపై అధిక ధరకు విక్రయించి

ఒకే బిల్లుతో పదేపదే తరలింపు

కానరాని నిఘా

ఇసుకపై నిఘా కొరవడింది. ఇంటి అవసరాలకు మాత్రమే ఉచితంగా ఇస్తున్న ఇసుకను అదే పేరుతో కొందరు దందా చేస్తున్నారు. అక్రమంగా తవ్వేసి ఓ చోట పోగేసి ఆపై అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు ఒకే బిల్లుపై అనేక సార్లు ఇసుకను పట్టుకుపోతున్నారు. మరికొందరు టైరు బండితో ఇసుకను సేకరించి ఓ చోట పోగేసి నచ్చిన రేటును డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విధంగా ఇసుకతో అక్రమార్కులు అడ్డదారిలో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నారు.

గజపతినగరం/ఎస్‌.కోట రూరల్‌, మే4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుకను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇంటి అవసరాల వరకు ఉచితంగా ఇస్తామంది. రోజుకు ఒక వ్యక్తికి 20 టన్నులు ఇస్తోంది. ఈ ఉచిత ఇసుక పాలసీని కొందరు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంటి కోసం అనిచెప్పి వ్యాపారం చేస్తున్నారు. గజపతినగరం సమీపంలో చంపావతి, ఏడొంపులగెడ్డ నుంచి అక్రమంగా ఇసుకను తరలించి గ్రామాల్లో నిల్వ చేసి అమ్మకాలు చేపడుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో లబ్ధిదారులకు తక్కువ ధరకు అందేలా ఇసుక విధానం తీసుకువచ్చారు. అక్రమంగా ఇసుకను నిల్వ చేసిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకొనేవారు. దీంతో అడ్డదారిలో రవాణా తగ్గేది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా జరిగింది. అత్యధిక ధరకు అమ్మకాలు సాగేవి. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే గ్రామాల్లో అన్ని పార్టీల నాయకులు కలిసిపోయి ఇసుక దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోఫణలు లేకపోలేదు. నాటుబళ్లతో తరలించి ఇసుకను నిల్వ చేసి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలు, పట్టణాలకు ఎటువంటి అనుమతులు లేకుండా తరలించి అమ్మకాలు చేపడుతున్నారు. నిత్యం ఇసుక అక్రమంగా తరలిపోతున్నా సంబంధిత అధికారులు నిఘా పెట్టడం లేదు. గజపతినగరం మండలంలోని ఎం.గుమడాం, కొత్తశ్రీరంగరాజపురం, కెంగువ, గంగచోళ్లపెంట, పురిటిపెంట తదితర గ్రామాల్లో ఇసుక నిల్వలు అధికంగా కనిపిస్తున్నాయి. గతరెండు నెలల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్‌ పట్టుకొన్నారు. ఒక ట్రాక్టర్‌ యజమానికి రూ.20వేలు, మరోట్రాక్టర్‌ యజమానికి రూ.10వేలు అపరాధ రుసుం విధించారు. అధికారులకు పక్కా సమాచారం ఉంటేనే దాడి చేసి పట్టుకుంటున్నారు. కానీ నిరంతర నిఘా లేదు. ఇష్టారాజ్యంగా నదుల్లో తవ్వకాలు చేపడుతుండడంతో తాగునీటి ఇబ్బందులు వస్తాయని ఆయా గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఒకే బిల్లుపై పలుమార్లు..

ఎస్‌.కోట మండలం బొడ్డవర-తాటిపూడి రోడ్డులో ఐతన్నపాలెం గ్రామం వద్ద భారీగా ఇసుక పోగులు కంట పడ్డాయి. ఆరా తీస్తే ఇక్కడో మతలబు ఉన్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో దాదాపు 90వరకు లారీలు ప్రతిరోజు శ్రీకాకుళం ప్రభుత్వ ఇసుక డిపో నుంచి రూ.5,500 నుంచి రూ.6,500 చెల్లించి బిల్లుతో ఇక్కడకు ఇసుకను తెస్తున్నాయి. తెచ్చిన ఇసుకను ఒకచోట పోగేసి వారికి నచ్చిన రేటుకు గృహ వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇదో రకమైన దోపిడీ జరుగుతుండగా ఒకే బిల్లుపై పదిసార్లు ఇసుకను తీసుకొస్తున్నారని కొత్త విషయం వెలుగుచూసింది. ఎస్‌.కోట, వేపాడ, కొత్తవలస మండలాల్లో ఈ తరహా వ్యవహారం జరుగుతోంది. ఒకరోజు తెచ్చిన బిల్లుపై వున్న ఇసుకను ఒకచోట వేసిన తరువాత అదేబిల్లుపై ఆయా మండలాల పరిధిలో నాటుబళ్లు, ట్రాక్టర్లు తీసుకొచ్చిన ఇసుకను లారీ లోడు రూ.3వేలకు కొంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తాము శ్రీకాకుళం నుంచి ఇసుకను తెచ్చినట్లు కలరింగ్‌ ఇస్తూ అందర్నీ బోల్తా కొట్టిస్తున్నారు. ఒకే బిల్లుపై ఒక లారీ ద్వారా రోజుకు మూడునుంచి ఐదు లారీల ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం.

Updated Date - May 04 , 2025 | 11:43 PM