తవ్వుకో.. దోచుకో!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:36 AM
అందరికీ ఉచిత ఇసుక.. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ఈ పథకం చేపట్టింది. ఎక్కడా ఇసుక కొరత లేకుండా చూడాలని ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల చాలామందికి మేలు జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
చంపావతిని గుల్ల చేస్తున్న అక్రమార్కులు
వంతెనలు, తాగునీటి పథకాల వద్ద సైతం
వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం
గోస్తాని, నాగావళి నదుల్లోనూ ఇదే పరిస్థితి
శ్మశానవాటికలనూ వదలని వైనం
అందరికీ ఉచిత ఇసుక.. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ఈ పథకం చేపట్టింది. ఎక్కడా ఇసుక కొరత లేకుండా చూడాలని ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల చాలామందికి మేలు జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే కొంతమంది ధనదాహం కారణంగా ఈ విధానానికి అక్కడక్కడా తూట్లు పడుతోంది. దీంతో వారు నదులను గుల్ల చేసేస్తున్నారు. ఏకంగా వాటి స్వరూపమే మార్చేస్తున్నారు. వంతెనలు.. తాగునీటి పథకాలు.. వేటినీ వదలడం లేదు. ఇసుకను తవ్వేసుకుని జేబులు నింపేసుకుంటున్నారు.
విజయనగరం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమార్కులు నదులను కొల్లగొడుతున్నారు. ఇసుకు తవ్వి అమ్ముకుంటున్నారు. చివరకు నదుల సమీపంలో ఉండే శ్మశానవాటికలను సైతం విడిచిపెట్టడం లేదు. ఇటీవల నెల్లిమర్ల మండలంలో మృతదేహానికి అంత్యక్రియలు చేసే చోట యంత్రాలతో ఇసుక తరలించారు. దీంతో అతి కష్టమ్మీద బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంపావతి, నాగావళి, సువర్ణముఖి, గోస్తానీ నదులతో పాటు చిన్నపాటి కాలువల్లో లభ్యమయ్యే ఇసుకను సైతం విడిచిపెట్టడం లేదు. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నదుల్లో ఇసుక చేరింది. దీంతో ఇసుకాసురులు తోడుకోవడం మొదలుపెట్టారు.
నిరంతర ప్రక్రియగా..
జిల్లాలో అన్ని నదుల్లో ఇసుక తరలింపు నిరంతర ప్రక్రియగా సాగుతోంది. నాటు, టైరుబండ్లతో ఇసుక తరలించడం, ఒకచోట పోగులు వేయడం.. రాత్రిపూట వాహనాల్లో తరలించుకుపోవడం పరిపాటిగా మారింది. నెల్లిమర్ల సమీపంలో రోడ్డు, రైల్వేవంతెన, తాగునీటి ట్యాంకులు, ఊటబావుల సమీపంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. వాస్తవానికి వీటికి 5 కిలోమీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు నిషేధం. కానీ కూతవేటు దూరంలోనే తవ్వి తరలించుకు పోతున్నారు.
చంపావతిలో దయనీయం..
జిల్లాలో చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల మీదుగా చంపావతి నది ప్రవహిస్తోంది. అక్రమార్కులు నదీతీర గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. గుర్ల మండలంలోని నడుపూరు, భూపాలపురం, సీతారాంపురం, కోటగండ్రేడు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా అధికంగా ఉంది. నెల్లిమర్లలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ సమీపంలోని పూర్తిగా నదిని గుల్లచేశారు. బృందావన్ వ్యాలీ వెనుక భాగంలో ఊటబావుల దగ్గరే ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో అవి ధ్వంసమవుతున్నాయి. నీలంరాజుపేట సమీపంలో భారీ డంపుగా నిల్వచేసి విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగ్గరాజుపేట వద్ద కూడా అదే పరిస్థితి. మొయిద నారాయణపట్నం సమీపంలో వంతెన పిల్లర్ల చుట్టూ ఉన్న ఇసుకను సైతం తోడేస్తున్నారు. భోగాపురం మండలంలోని కోటభోగాపురం, పూసపాటిరేగ మండలం రెల్లివలస, డెంకాడ మండలం నాతవలస, చొల్లంగిపేట ప్రాంతాల్లో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
గోస్తనీకి తప్పని బాధ..
ఎస్.కోట నియోజకవర్గంలో గోస్తనీ నదికి సైతం ఇసుకాసురుల బాధ తప్పడం లేదు. ఎస్.కోట మండలం ధర్మవరం, మామిడిపల్లి ఊటబావుల వద్ద తవ్వకాలు సాగుతున్నాయి. జామి మండలం భీమసింగి వద్ద రికార్డు స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. కొండంపేట సమీపంలో వేకువజామున పెద్ద ఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. తెల్లవారక మునుపే పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ప్రతిరోజూ ఇసుకను తరలించుకుపోతున్నారు. సమీప తోటల్లో ఇసుకను నిల్వ చేసి విజయనగరం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
నాగావళిలోనూ అధికం..
నాగావళి నదిలోనూ ఇదే పరిస్థితి. రాజాం నియోజకవర్గాల పరిధిలోని వంగర, రేగిడి ఆమదావలస, సంతకవిటి మండలాల్లో నాగావళి నది ప్రవహిస్తోంది. అయితే ప్రతి గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. రేగిడి మండలం సంకిలికి కూతవేటు దూరంలో వంతెన సమీపంలోనే తవ్వకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమీపంలోనే రాజాం పట్టణానికి సంబంధించి తాగునీటి పథకాలు ఉన్నాయి. వంతెనతో పాటు ఈ పథకాల చెంతనే ఇసుక తోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతోందన్న విమర్శలున్నాయి.
ధర తగ్గినా.. జిల్లాలను దాటిస్తూ..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక పాలసీని మార్చింది. ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం గృహనిర్మాణం జోరుగా సాగుతోంది. గతంలో వైసీపీ హయాంలో లారీ ఇసుక లోడు రూ.30 వేలు దాటింది. కానీ ఇప్పుడు ఇసుక విధానం మార్చడంతో కేవలం రవాణా చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ దూరం బట్టి వసూలు చేస్తున్నారు. అయితే విజయనగరం, విశాఖలో ఇసుక అవసరాల కోసం ఉచిత ఇసుక విధానాన్ని సైతం మార్చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. జిల్లా నుంచి ప్రతిరోజూ వందలాది లారీ లోడ్లు ఇసుక తరలుతోంది. ప్రభుత్వ లక్ష్యానికి గండిపడుతుండగా.. జిల్లా అవసరాల మేరకు ఇసుక అందడం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.