Reorganization! పునర్విభజన కష్టాలు!
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:22 AM
Difficulties in Reorganization! గత వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా భామిని మండలవాసులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రధానంగా జిల్లాల విభజన వారికి శాపంగా మారింది. నాటి ప్రభుత్వం ప్రజాభ్రిపాయసేకరణ చేపట్టకుండా.. భౌగోళిక పరిస్థితులు పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో నేటికీ అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భామిని మండలవాసులకు తప్పని ఇబ్బందులు
గతంలోనే వ్యతిరేకించినా పట్టించుకోని వైనం
జిల్లాకేంద్రం పార్వతీపురం చేరుకోవాలంటే .. మూడు బస్సులు మారాల్సిందే..
విద్య, వైద్య సేవలన్నీ శ్రీకాకుళం జిల్లాలోనే..
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
సిక్కోలులో చేరిస్తే మేలంటున్న ప్రజలు
భామిని, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా భామిని మండలవాసులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రధానంగా జిల్లాల విభజన వారికి శాపంగా మారింది. నాటి ప్రభుత్వం ప్రజాభ్రిపాయసేకరణ చేపట్టకుండా.. భౌగోళిక పరిస్థితులు పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో నేటికీ అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్య, వైద్య సేవలను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. జిల్లాకేంద్రం పార్వతీపురం చేరుకోవాలన్నా.. వ్యయప్రయాసాలకు గురవ్వాల్సి వస్తోంది. దీనిపై గతంలో వారు నిరసన కార్యక్రమాలు చేపట్టినా వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. కాగా కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజక వర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెలరోజుల్లో పూర్తికావాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో భామిని మండ లవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో కొత్తూరు మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు భామిని మండలాన్ని తిరిగి శ్రీకాకుళం జిల్లాలో చేర్చాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో చివరి మండలంగా ఉన్న భామిని పాలకొండ నియోజకవర్గంలో ఉండడంతో దానిని పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చారు. అప్పటికే అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ మండలం మన్యం జిల్లాలోకి వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆ ప్రాంతవాసులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తప్ప పార్వతీపురం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం వారికి ఉండడం లేదు. డిగ్రీతో పాటు ఉన్నత చదువుల కోసం విద్యార్థులు, వ్యాపారులు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి వెళ్లాల్సి వస్తోంది. ఆర్డీవో కార్యాలయాన్ని పార్వతీపురం నుంచి పాలకొండకు మారడంతో భామినితో పాటు గుమ్మలక్ష్మీపురం మండలవాసులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తంగా పాలనా సౌలభ్యం లేకపోవడంతో మన్యం జిల్లాలో భామిని మండలం పేరుకే అన్నట్టుగా ఉంది.
పార్వతీపురం వెళ్లాలంటే.. ఒక రోజు ప్రయాణమే..
- భామిని నుంచి పార్వతీపురం చేరుకోవాలంటే భామిని మండల వాసులు నానా అవస్థలు పడుతున్నారు. 80 కిలోమీటర్లు దాటితే తప్ప జిల్లా కేంద్రానికి చేరుకోలేకపోతున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ రోడ్డు మీదుగా, మరోవైపు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు దాటించి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు మూడు బస్సులు మారాలి. భామిని నుంచి కొత్తూరు అక్కడి నుంచి పాలకొండ మీదుగా పార్వతీపురం చేరుకోవాల్సి వస్తోంది. పార్వతీపురానికి నేరుగా వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో భామిని మండల వాసులు ఓ రోజు ప్రయాణించాల్సి వస్తోంది. అదే శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి వెళ్లాలంటే ప్రతి అరగంటకు ఓ బస్సు అందుబాటులో ఉండడంతో అక్కడే వారు విద్య, వైద్య సేవలు పొందుతున్నారు. భామిని మీదుగా బత్తిలి గ్రామానికి ప్రతి 30 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. దీంతో ప్రజలు శ్రీకాకుళం వైపు ఎక్కువగా వెళ్తుంటారు.
- ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అస్తవ్యస్తంగా జరిగినట్లు కూటమి సర్కార్ గుర్తించిన నేపథ్యంలో భామిని మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలోనే విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.