Share News

different 'job' for them వారికి భలే ‘ఉపాధి’

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:49 PM

different 'job' for them ఉపాధి హామీ.. ఈ పేరు చెబితేనే ప్రజల్లో ఒకరకమైన అపవాదు ఉంది. కొన్ని శాఖల మాదిరిగానే అవినీతి శాఖగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ పంచుకుంటున్నారన్న ఆరోపణ ఉంది.

different 'job' for them వారికి భలే ‘ఉపాధి’

వారికి భలే ‘ఉపాధి’

కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అక్రమాలు

సామాజిక తనిఖీలోనూ చేతివాటం

చేయితడిపితే అంతా సక్రమం

తూతూమంత్రంగా జరిమానాలు

రికవరీలూ లేవు

ఉపాధి హామీ.. ఈ పేరు చెబితేనే ప్రజల్లో ఒకరకమైన అపవాదు ఉంది. కొన్ని శాఖల మాదిరిగానే అవినీతి శాఖగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ పంచుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. ఇటీవల సామాజిక తనిఖీ సమయంలో కొత్తవలసలో ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌కు జరిమానా విధించారు. అయితే ప్రతిచోటా ఇలాంటి లోపాలుంటున్నాయి. కానీ కొన్నిచోట్లే బయటకు వస్తున్నాయి. సామాజిక తనిఖీ చేపట్టిన అధికారులు, సిబ్బందికి మామ్మూళ్లు అందిన చోట్ల లోపాలు అంతగా బయటకు రావని అంతా చెప్పుకుంటున్నారు.

రాజాం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత ఏడాది మూడు విడతల్లో ఉపాధి హామీ సామాజిక తనిఖీలు జరిగాయి కానీ లోపాలను అంతంతమాత్రంగా గుర్తించారు. రికవరీలూ అంతే. తనిఖీల్లో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్టు ఆ శాఖ నుంచే ఆరోపణలు వినిపించాయి. రూ.కోటి పనులు జరిగిన పంచాయతీల్లో తనిఖీ అధికారులకు సంబంధించి డీఆర్పీలు అడుగుపెడితే రూ.10 వేలు ముట్టజెప్పారట. రూ.కోటి దాటితే రూ.18 వేలను ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో మండలం నుంచి జిల్లాస్థాయి అధికారికి రూ.50 వేలు, మరో అధికారికి రూ.50 వేలు కేవలం తనిఖీ సమయాల్లో అందించారట. ఆయా మండలాల్లో పనిచేసే ప్రధాన అధికారి వసూలు చేసి ఇచ్చారట. ఇది స్వయగా ఆ శాఖ వర్గాలే అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు. దీనినిబట్టి ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అవినీతి ప్రభావం పనులతో పాటు పనులు చేసే వేతనదారులపై కూడా పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి సామాజిక తనిఖీ ప్రారంభమైంది. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ఆ స్థాయిలో రికవరీలు లేవని ఉపాధి హామీ సిబ్బంది చెబుతున్నారు.

జిల్లాలో 6.85 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 3.85 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఉపాధి హామీ పనుల్లో క్షేత్ర సహాయకులు కీలకం. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడం, మస్తర్ల కేటాయింపు, కొత్త జాబ్‌కార్డుల మంజూరు, ఆధార్‌తో అనుసంధానం, కూలీలకు వసతుల కల్పన వీరి ప్రధాన విధి. కానీ చాలా గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. సీనియర్‌ మేట్లకు పనులు అప్పగించి సొంత పనులు చూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పైగా పనులు చేపట్టే వేతనదారుల బృందానికి సంబంధించి.. ఒక్కో మేట్‌ నేతృత్వంలో ఒక్కోలా వేతనాలు వస్తుండడంతో కొన్ని గ్రామాల్లో వివాదాలు నెలకొంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సమయపాలన పాటించడం లేదని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఉదయం గంట, సాయంత్ర గంట పనిచేయించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఉపాధిలో అవినీతి వల్లే క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఏది జరిగినా అధికారులు కాపాడుతారులే అన్న ధీమా వారిలో ఉంది.

వైసీపీ హయాంలో భారీ అవినీతి..

వైసీపీ హయాంలో ఈ పథకం అవినీతిమయంగా మారింది. అక్రమాలకు అలవాటుపడిన యంత్రాంగం అదే బాటను కొనసాగిస్తోంది. వాస్తవానికి ఉపాధి హామీ పథకం పర్యవేక్షణ అధికార యంత్రాంగానివే. ఇందులో నేరుగా రాజకీయ జోక్యం ఉండదు. కిందిస్థాయి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుంచి పైస్థాయిలో జిల్లా అధికారులే పర్యవేక్షకులుగా ఉంటారు. కానీ తిలా పాపం తలో పిడికెడు అన్నట్టు ఈ అవినీతిలో అందరి పాత్ర ఉంటోంది. కూలీల కష్టాన్ని దోచుకుంది కొందరైతే..దొంగ మస్తర్లతో సొమ్ము పక్కదారి పట్టించింది మరికొందరు...ఇలా వైసీపీ హయాంలో జిల్లాలో భారీగా అవినీతి జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చెక్‌పడుతుందని అంతా భావించారు కానీ అప్పటి అధికారులు, సిబ్బంది ఉండడం.. అలవాటు పడిన పని కావడంతో కొంతమంది ఇప్పటికీ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్టు సామాజిక తనిఖీ ప్రజా వేదికలో వెల్లడించినా రికవరీ శూన్యం. దీనిపై కూటమి ప్రజాప్రతినిధులు సైతం దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌లకు ఫిర్యాదులు వెళ్లినా సీరియస్‌ యాక్షన్‌లోకి దిగడం లేదు.

దృష్టిపెట్టాం

ఉపాధి హామీ పథకంలో నిర్లక్ష్యానికి తావులేదు. ఈ విషయంలో అధికారులతో పాటు సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ఫీల్డ్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పని ప్రదేశంలో ఉండి పనులు చేయించాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. సామాజిక తనిఖీలు సక్రమంగా చేయని సిబ్బందిపై కూడా చర్యలుంటాయి. రికవరీలు కూడా చేస్తాం.

- శారదాంబ, డ్వామా పీడీ, విజయనగరం

Updated Date - Sep 22 , 2025 | 11:49 PM