Share News

Diet student suicide? డైట్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:01 AM

Diet student suicide? భావి ఉపాధ్యాయుడు కావాల్సిన ఆ యువకునికి ఏం కష్టమొచ్చిందో.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఎన్నో ఆశలతో ఉపాధ్యాయ ట్రైనింగ్‌కు వచ్చి జీవితాన్నే ముగించాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చాడో కాని అతని బలవన్మరణం తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది.

Diet student suicide? డైట్‌ విద్యార్థి ఆత్మహత్య
కోనేటి మహేష్‌(ఫైల్‌)

డైట్‌ విద్యార్థి ఆత్మహత్య

వసతిగృహంలో ఉరి వేసుకుని బలవన్మరణం

సూసైడ్‌ లె టర్‌ను గోప్యంగా ఉంచిన సిబ్బంది, పోలీసులు

నెల్లిమర్ల, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): భావి ఉపాధ్యాయుడు కావాల్సిన ఆ యువకునికి ఏం కష్టమొచ్చిందో.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఎన్నో ఆశలతో ఉపాధ్యాయ ట్రైనింగ్‌కు వచ్చి జీవితాన్నే ముగించాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చాడో కాని అతని బలవన్మరణం తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. స్థానిక వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్‌ కళాశాల విద్యార్థి కూనేటి మహేష్‌ (24) విషాదాంతమిది. కళాశాల వసతిగృహంలో రీడింగ్‌ రూమ్‌లో ఉరివేసుకొని చనిపోయాడు. మంగళవారం అర్ధరాత్రి చనిపోగా బుధవారం ఉదయం 6 గంటలకు తోటి విద్యార్థులు గమనించారు. విజయనగరం రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

సాలూరు మండలం జిల్లేడువలస గ్రామానికి చెందిన మహేష్‌ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం 2024లో ఉపాధ్యాయ శిక్షణ కోసం డైట్‌ కళాశాలలో చేరాడు. డైట్‌ క్యాంపస్‌లోనే ఉన్న బాలుర వసతిగృహంలో తోటి విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వసతిగృహంలో ఉన్న రీడింగ్‌ రూమ్‌లో సహ విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు. అందరూ గదుల్లోకి వెళ్లిపోయినా మహేష్‌ మాత్రం అక్కడే ఉండిపోయాడు. రాత్రంతా రూమ్‌కు రాకపోవడంతో ఉదయం 6 గంటలకు తోటి విద్యార్థులు రీడింగ్‌రూమ్‌కు వెళ్లి చూశారు. అప్పటికే మహేష్‌ ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆర్‌జేడీ విజయభాస్కర్‌, డీఈవో మాణిక్యంనాయుడు, రిటైర్డ్‌ డీఈవో డాక్టర్‌ ఎన్‌టీ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. మహేష్‌ మృతి పట్ల ప్రిన్సిపాల్‌ రామకృష్ణారావు, అధ్యాపకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా మహేష్‌ మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. సూసైట్‌నోట్‌ రాసినట్లు తెలిసింది. ఆ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కుటుంబ, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు డైట్‌ కళాశాలకు చేరుకొని బోరున విలపించారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకెళ్లారు.

-------------------

Updated Date - Dec 25 , 2025 | 12:01 AM