కళ్లు మూసుకున్నారా.. లక్షలు తీసుకున్నారా?
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:16 AM
ఓ భూమి ముగ్గురు వ్యక్తుల అనుభవంలో ఉంది. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఆ భూమిని ఆన్‌లైన్ చేయించుకున్నారు.
- మాకు తెలియకుండా భూమిని ఎలా ఆన్‌లైన్ చేస్తారు?
- రెవెన్యూ సిబ్బందిని నిలదీసిన బాధితులు
భోగాపురం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఓ భూమి ముగ్గురు వ్యక్తుల అనుభవంలో ఉంది. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఆ భూమిని ఆన్‌లైన్ చేయించుకున్నారు. ఈ విషయం మూడో వ్యక్తికి తెలియడంతో తన కుటుంబంతో సహా భోగాపురం తహసీల్దార్ కార్యాలయానికి శుక్రవారం చేరుకుని అధికారులను నిలదీశారు. తనకు తెలియకుండా మిగతా ఇద్దరి పేరిట భూమిని ఎలా ఆన్‌లైన్ చేస్తారంటూ నిలదీశారు. కళ్లు మూసుకున్నారా?.. రూ.లక్షలు తీసుకుని ఈ పని చేశారా? అంటూ ప్రశ్నించారు. బాధితుల వివరాల మేరకు.. భోగాపురం రెవెన్యూ పరిధిలో తూర్పుఖండం సర్వే నెంబరు 280/1లో 3.54 ఎకరాల భూమి కొమ్మూరు అప్పలస్వామి అనే వ్యక్తి పేరు మీద ఎఫ్‌సీవో ఉంది. అప్పలస్వామి మృతి చెందడంతో పూర్తి బాధ్యతలు ఆయన అల్లుడు కందుల రఘుబాబు చూసుకుంటున్నారు. ఈ భూమి గత కొంతకాలంగా కొయ్యపేటకు చెందిన కొయ్య అప్పలనర్సమ్మ, కొయ్య సూరప్పయ్యమ్మ, మునగల పోలమ్మ అనుభవంలో ఉంది. ఈ భూమిని ఏ విధంగానైనా ఆన్‌లైన్ చేసుకోవాలని ఈ ముగ్గురు వ్యక్తులు భావించారు. భోగాపురానికి చెందిన రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులను కలిశారు. ఆ నాయకులు రెవెన్యూ అధికారులతో మంతనాలు జరిపారు. ఈ మేరకు ఈనెల 1న కొయ్య సూరప్పయ్యమ్మ, మునగల రమణ (పోలమ్మ కుమారుడు) పేరుమీద 1.77 ఎకరాల చొప్పున రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేసేశారు. అప్పలనర్సమ్మ పేరును మాత్రం చేర్చలేదు. ఈ విషయం తెలియడంతో కొయ్య అప్పలనర్సమ్మ, కుటుంబీకులు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. తహసీల్దార్ లేకపోవడంతో వీఆర్వోలతో మాట్లాడారు. ఏవిధంగా ఆన్‌లైన్ చేస్తారు కళ్లు మూసుకున్నారా, ఎంత తీసుకున్నారంటూ వీఆర్వోలపై విరుచుకుపడ్డారు. సుమారు గంటన్నర పాటు కార్యాలయం హోరెత్తి పోయింది. కార్యాలయ ఆవరణలో అప్పలనర్సమ్మ, పోలమ్మ కుటుంబీలు బాహబాహీకి దిగారు. దీనిపై మునగల రమణ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ కోసం అప్పలనర్సమ్మను రావాలని చెప్పినా రాలేదన్నారు. వారి భూమి వారికి ఇచ్చేస్తామని తెలిపాడు. కాగా, ఎఫ్‌సీవోలో పేరు ఉన్న వారికి తెలియ కుండా, ఎటువంటి విచారణ చేయకుండా, ఎటువంటి పత్రాలు లేకుండా అనుభవంలో ఉన్న వ్యక్తుల పేరున భూమిని ఆన్‌లైన్ చేయడంపై రెవెన్యూ సిబ్బందిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.