Share News

Dialysis Seethampeta సీతంపేటలో డయాలసిస్‌

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:43 PM

Dialysis Facility at Seethampeta ఏజెన్సీ వాసులకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. జిల్లాలో మరో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నేషనల్‌ డయాలసిన్‌ ప్రోగ్రాం కింద సీతంపేటలో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Dialysis Seethampeta సీతంపేటలో డయాలసిస్‌
సీతంపేట ఏరియా ఆసుపత్రి

  • కిడ్నీ బాధితులకు తీరనున్న కష్టాలు

పార్వతీపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ వాసులకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. జిల్లాలో మరో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నేషనల్‌ డయాలసిన్‌ ప్రోగ్రాం కింద సీతంపేటలో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సమారు రూ.75 లక్షలతో రక్తశుద్ధి యంత్రాలు, పరికరాలు సమకూర్చనున్నారు. పీపీపీ విధానంలో సీతంపేట ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. నిర్వహణ బాధ్యతను ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. రోజూ మూడు సెషన్స్‌ ద్వారా 15 మందికి డయాలసిస్‌ చేయనున్నారు. కాగా గిరిజన ప్రాతంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డయాలసిస్‌ కోసం బాధితులు సీతంపేట నుంచి పాలకొండ , పార్వతీపురం, శ్రీకాకుళం తరలి వెళ్లాల్సి వస్తోంది. సీతంపేటలో కేంద్రం ఏర్పాటైతే భామిని, గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం, సీతంపేట మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, బత్తిలి, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి వంటి ప్రాంతాల వాసులకు డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ప్రత్యేక వార్డు సిద్ధం

సీతంపేట రూరల్‌: డయాలసిస్‌ కేంద్రం కోసం సీతంపేట ఏరియా ఆసుపత్రిలో 15బెడ్‌లతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. బాధితులకు సేవలందించేందుకు వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవంగా గత ఏడాది సీతంపేట ఏరియా ఆసుపత్రిలో 5బెడ్‌లతో డయాలసెస్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. అయితే వార్డులు ఖాళీ లేకపోవడంతో తాత్కాలికంగా యూనిట్‌ ఏర్పాటును నిలిపివేశారు. అయితే కొద్ది రోజుల కిందట ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన పై అంతస్థులో అదనపు వార్డులు సిద్ధమయ్యాయి. దీంతో కింద అంతస్థులో నిర్వహిస్తున్న జనరల్‌ వార్డులను ఖాళీ చేయించారు. ఆ వార్డులో డయాలసిస్‌ కేంద్రం నిర్వహణకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. దీనిపై సీతంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెండ్‌ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఒక వార్డులో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

Updated Date - Oct 21 , 2025 | 11:43 PM