Dialysis center at S. Kota Hospital ఎస్.కోట ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:16 AM
Dialysis center at S. Kota Hospital శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కానుంది. వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ మంగళవారం ఈ మేరకు ప్రకటించారు.
ఎస్.కోట ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం
కిడ్నీ వ్యాధి బాధితులకు తప్పనున్న వ్యయప్రయాసలు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే లలితకుమారి
శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కానుంది. వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ మంగళవారం ఈ మేరకు ప్రకటించారు. కిడ్నీ వ్యాఽధి బాధితులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. వారికి వ్యయప్రయాసలు తప్పుతాయి. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలతో పాటు గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ మండల ప్రజలు ఎక్కువగా ఈ ఆసుపత్రినే ఆశ్రయిస్తుంటారు. డయాలసిస్ కోసం విశాఖ నగరానికి వెళ్తున్నవారంతా ఇకనుంచి ఎస్.కోట రావొచ్చు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌లకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కృతజ్ఞతలు తెలిపారు.
శృంగవరపుకోట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు డయాలసిస్ కేంద్రాల్లో జిల్లా పరిధిలోని శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి ఒకటి కేటాయించారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఏర్పాటు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ మంగళవారం వీటిని ప్రకటించారు. ప్రతి కేంద్రంలోనూ రోజూ మూడు సెషన్ల ద్వారా 15 మందికి రక్తశుద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రం (పీఎంఎన్డీపీ) కింద ఏర్పాటు కానున్న ఈ కేంద్రానికి ఒక్కో చోట రూ.75లక్షల విలువైన మూడు రక్త శుద్ధి యంత్రాలు, పరికరాలు సమకూర్చుతారు. ప్రస్తుతం రాష్ట్ట్రంలో 232 డయాలసిస్ కేంద్రాలున్నాయి. కొత్త వాటితో ఆ సంఖ్య 239కు చేరుకోనుంది. అయితే ప్రస్తుతం ఏర్పాటు కానున్న కేంద్రాలు అత్యధికంగా గిరిజన ప్రజలకు ఉపయోగపడనున్నాయి. వీటిని ఏర్పాటు చేసే ఆసుపత్రులన్నీ గిరిజనులు ఎక్కువగా వైద్యానికి వస్తున్నవే. ఈ కేంద్రాలు అతి త్వరలో పని చేయనున్నాయి. పీపీసీ విధానంలో వీటి నిర్వహణ బాధ్యతను ఓ సంస్థకు అప్పగించారు. కాగా 2024-2025 ఆర్థిక సంవత్సరంలో డయాలసిస్ చేసుకున్న కిడ్నీవ్యాధి బాధితుల కోసం కూటమి ప్రభుత్వం రూ.164 కోట్లు వ్యయం చేసింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రూ.110 కోట్లు, ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రం కింద రూ.54 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు డయాలసిస్ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం ద్వారా వ్యయ, ప్రయాసలు తప్పనున్నాయి.
ఫ ఈ ప్రాంతాల్లో కిడ్నీ పాడైనవారంతా విశాఖ కేజీహెచ్, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కేజీహెచ్‌లో ఉచితంగా డయాలసిస్ చేస్తున్నప్పటికీ ప్రయాణ ఖర్చులు తప్పడం లేదు. రోగితో పాటు ఒకరిద్దరు ఉండాల్సి వస్తుంది. నెలలో రెండు నుంచి నాలుగు సార్లు వెళ్లాల్సి రావడంతో పేద, బడుగు వర్గాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కొత్తగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడంతో ఎంతో మంది పేదలకు ఖర్చుతో పాటు ప్రయాణం తప్పనుంది.