Totapalli తోటపల్లికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:22 PM
Devotees Throng Totapalli ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించి పులకించిపోయారు.
అప్రమత్తమైన పోలీసు, దేవదాయ శాఖ అధికారులు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు
గరుగుబిల్లి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించి పులకించిపోయారు. తోటపల్లి ప్రాంతం నమో వేంకటేశాయ, గోవింద నామస్మరణతో మార్మోగింది. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకాదశి పూజలకు 10 వేలకు పైబడి భక్తులు రావడంతో గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. కాశీబుగ్గలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో బి.శ్రీనివాస్, సిబ్బందితో పాటు దేవస్థానం అభివృద్ధి సేవా ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో తోపులాట జరగకుండా వరుస క్రమంలో స్వామి దర్శనానికి అనుమ తించారు. దేవస్థానాల పరిధిలోని ఉప ఆలయాలు, పుట్టు దేవుడు గుడి ప్రాంతంతో పాటు ప్రధాన రహదారి దేవస్థానాల పరిధిలో ఎటు చూసినా భక్తుల సందడే కనిపించింది. దర్శనానికి వచ్చిన వారికి ఆలయ సిబ్బంది తాగునీటితో పాటు ప్రసాదాలు సమకూర్చారు. సేవా ట్రస్ట్ ప్రతినిధులు మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు.