Tribal Regions మన్యంలో ప్రగతి పరుగులు
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:43 AM
Development Gains Pace in Tribal Regions పార్వతీపురం మన్యం జిల్లా ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉంది. పేరుకే కొత్త జిల్లా. కానీ ఎక్కడా ఎటువంటి మార్పు కనిపించలేదు. ఎంతో కొంత అభివృద్ధి పనులు కనిపించాయి అంటే అదీ గతంలో టీడీపీ హయాంలో...విజయనగరం జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే. వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలూ గాడితప్పాయి.
ఉచిత ఇసుకతో ఊపందుకున్న గృహ నిర్మాణం
ఉచిత గ్యాస్‌తో చిరు కుటుంబాలకు ఊతం
అభివృద్ధి బాటలో గిరిజన గ్రామాలు
విద్య వైద్యం, మౌలిక వసతులకు పెద్దపీట
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం
ఇదీ ఏడాది కూటమి పాలన ప్రత్యేకత
పార్వతీపురం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉంది. పేరుకే కొత్త జిల్లా. కానీ ఎక్కడా ఎటువంటి మార్పు కనిపించలేదు. ఎంతో కొంత అభివృద్ధి పనులు కనిపించాయి అంటే అదీ గతంలో టీడీపీ హయాంలో...విజయనగరం జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే. వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలూ గాడితప్పాయి. అభివృద్ధి పనులు అడుగు కూడా కదల్లేదు సరికదా జిల్లా మరింత వెనుకబాటుకు గురైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చింది. పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే వైసీపీ హయాంలో గాడి తప్పిన పాలనను సరిచేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అనేక అభివృద్ధి పనులతో కూటమి తొలి ఏడాది పాలన నడిచింది.
పెరిగిన పింఛన్లు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే సామాజిక భద్రత పింఛ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచింది. అంతకుముందు మూడు నెలల పింఛను కలిపి అందించింది. రూ.1000 పెంచేందుకు వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్ల సమయం పట్టింది. కానీ సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక కష్టాలను భయపడకుండా మొదటి నెల నుంచే రూ.1000 పెంచారు. దీంతో వృద్ధాప్య, వితంతు పింఛను రూ.4వేలకు చేరింది. దివ్యాంగులకు ఇచ్చే పింఛనును రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. కుటుంబంలో పింఛను తీసుకొనే భర్త చనిపోతే అతని భార్యకు నెలలోనే సామాజిక పింఛను అందించేలా కొత్తగా స్పౌజ్ కేటగిరీని అమలు చేశారు. జిల్లాలో మొత్తం 1,39,111 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.59.32 కోట్లను నెల నెలా అందిస్తున్నారు.
ఉచితంగా సిలిండర్లు
కూటమి ప్రభుత్వంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు జీవన కష్టాలు తొలగాయి. ముఖ్యంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుండడంతో వారిపై కొంత ఆర్థికభారం తగ్గించినట్లయింది. ఉచిత గ్యాస్‌కు సంబంధించి ముందుగానే నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీపం-2 పథకం ద్వారా లబ్ధిపొందిన వారు మొత్తం 52,062 మంది. ఉచితంగా అందించిన సిలిండర్లు 1,22,382. వీరి ఖాతాల్లో రూ.నాలుగు కోట్ల పది లక్షల 87 వేల 653 నగదు జమ చేశారు.
ఇసుకా ఉచితమే
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా ఇసుక అందించి సామాన్య, మధ్యతరగతి వర్గాలకు కొండంత అండగా నిలిచింది. టన్ను ఇసుకను నామమాత్రంగా రూ.609కి అందిస్తున్నారు. ప్రభుత్వ ఫీజు లేదు. సీనరేజ్, నిర్వహణ ఖర్చులనే వసూలు చేస్తున్నారు. జిల్లాలో మూడు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి ఇసుక కొరత లేకుండా నిర్మాణదారులకు అందించారు. దీంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. వేలాది కార్మికులకు ఉపాధి మెరుగయ్యేలా చేశారు. పల్లెపండుగ పేరిట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సీసీ కాలువలు, రహదారుల నిర్మాణం చేపట్టారు.
రైతుల్లో ఆనందం
కూటమి ప్రభుత్వం రైతుల్లోనూ సంతోషం నింపింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. జిల్లాలో 2,24,292 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 37,491 మంది రైతుల ఖాతాల్లో రూ.517 కోట్లు జమ చేసింది.
నిరుద్యోగుల్లో సంతోషం
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుతం మెగా డీఎస్సీని నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 583 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో డీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొద్దిరోజులకే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీని ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. వీటితో పాటు అన్నక్యాంటీన్లతో రూ.15కే మూడుపూటలా పేదవాడి కడుపు నిండుతోంది. త్వరలో అన్నదాతా సుఖీభవ, తల్లికివందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను పట్టాలు ఎక్కించనుంది.
అమరావతికి ‘మన్యం’ నేతలు
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం అమరావతిలో ‘సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో వేడుకలు నిర్వహించనుంది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకల్లో మన్యం నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అమరావతికి బయల్దేరారు. ఏడాది పాలన సంబరాల్లో వారు భాగస్వాములు కానున్నారు.
హామీలు అమలు చేస్తున్నాం
ఏడాదిలో పాలనలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను విజయ వంతంగా అమలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నాం. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా.. ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. సాలూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాం. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. డోలీ మోతలు తప్పించేందుకు పక్కా రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యం ద్వారా మధ్యాహణ్నం భోజనం అందించేందుకు చర్యలు పూర్తయ్యాయి.
- గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
==============================================
అభివృద్ధే లక్ష్యం
పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఏడాదిలో పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. నియోజకవర్గంలో సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీతానగరం వంతెన నిర్మాణం, ములగ నుంచి గ్రామానికి బీటీ రహదారి నిర్మాణం తదితర పనులు చేపట్టాం.
- బోనెల విజయచంద్ర, ఎమ్మెల్యే, పార్వతీపురం
==============================================
రహదారులు నిర్మిస్తున్నాం
ఏడాదిలో కురుపాం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నాం. గోతులమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. రూ.33 కోట్లతో పీవీటీజీ గ్రామాలకు పక్కా రహదారులు నిర్మిస్తున్నాం. మధ్యలో నిలిచిపోయిన జలజీవన్‌మిషన్ పనుల పూర్తికి నిధులు మంజూరు చేయించాం. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
- తోయక జగదీశ్వరి, ప్రభుత్వ విప్
==============================================
మోడల్‌గా తీర్చిదిద్దుతా..
పాలకొండ నియోజకవర్గాన్ని మోడల్‌గా అభివృద్ధి చేస్తా. ఏడాదిలో ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం.
- నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఎమ్మెల్యే