Develop Villages పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:52 PM
Develop Villages into Beautiful Habitats జిల్లాలో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామ ముస్తాబు కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ప్రైవేట్ కల్యాణ మండపంలో సర్పంచ్‌లు, అధికారులతో సమీక్షించారు.
బెలగాం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామ ముస్తాబు కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ప్రైవేట్ కల్యాణ మండపంలో సర్పంచ్‌లు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ముస్తాబును అమలు చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇకపై గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం అమలు చేయాలి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల రోగాలకు చెక్ పెట్టొచ్చు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచులదే. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.’ అని తెలిపారు.
ఇంధన పొదుపుపై అవగాహన
ఇంధన పొదుపు , విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సోమవారం పట్టణంలో ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 20 వరకు వారోత్సవాలు జరగుతాయన్నారు. జిల్లాలోని విద్యా సంస్థలు, వసతి గృహాలు, సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధన పొదుపు పాటించాలన్నారు. ఎల్‌ఈడీ బల్బులు, నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, విద్యుత్ పొదుపుపై అవగాహన సమావేశాలు, ర్యాలీలు నిర్వహంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, విద్యుత్ శాఖ అధికారులు చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
21న పల్స్‌పోలియో
పార్వతీపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్‌పోలియో కార్య క్రమాన్ని చేపట్టనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పల్స్‌పోలియో కార్యక్రమంపై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 99,507 మంది పిల్లలకు 905 బూతుల్లో పల్స్‌పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. 42 సంచార బృందాలు 178 మారుమూల ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, బజార్లు, పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తాయని వెల్లడించారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఇందులో 72 మంది వైద్యాధికారులు, 382 మంది ఏఎన్‌ఎంలు, 277 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, 1545 మంది ఆశా కార్యకర్తలు, 2,075 అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొంటారన్నారు. తొమ్మిది మంది జిల్లావైద్య ఆరోగ్యశాకాధికారులతో పాటు 93 మంది ఆరోగ్య పర్యవేక్షులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం
జల జీవన్‌మిషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన డిస్ర్టిక్ట్ వాటర్, శానిటేషన్ కమిటీ సమావేశంలో అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. కాగా జలజీవన్ పనులు, గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జేజేఎం పనులు అనుకున్న దానికంటే చాలా నెమ్మదిగా సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణాల పురోగతి కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.