పట్టాలు తప్పిన గూడ్స్
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:16 AM
బియ్యంలోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
- రెండు బోగీలు పూర్తిగా ధ్వంసం
- పాక్షికంగా దెబ్బతిన్న మరో మూడు బోగీలు
- నాగపూర్ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్తుండగా ఘటన
- ట్రాక్‌ని పునరుద్ధరించిన రైల్వే అధికారులు
- పలు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం
- ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
విజయనగరం/ క్రైం, ఆగస్టు 29 ( ఆంధ్రజ్యోతి): బియ్యంలోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాగపూర్ నుంచి కాకినాడ పోర్టుకి బియ్యం లోడుతో వెళ్తున్న గూడ్స్ విజయనగరం రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం దాటిన వెంటనే శుక్రవారం ఉదయం సుమారు 6.30 గంటల ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు పూర్తిగా ధ్వంసంకాగా, మూడు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైల్వే విద్యుత్ లైనుతో పాటు ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న డీఆర్‌ఎం లలిత్‌బోరాతో పాటు సీనియర్ అధికారులు, ఇంజనీరింగ్, కమర్షియల్, మెంటేనెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. భారీ ప్రొక్లైనర్లతో వ్యాగన్‌లను పక్కకు తీశారు. లోపల వున్న బియ్యాన్ని కూలీలతో పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పక్కన నెట్టుగా వేయించారు. కూలీలను భారీ ఎత్తున తీసుకువచ్చి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి ఏ సమయానికైనా ట్రాక్‌ని పూర్తిగా పునరుద్ధరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తక్కువ స్పీడ్‌తో వెళ్లడంతో భారీ నష్టం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ప్రమాద జరిగిన సమయంలో పక్కనుంచి ఏ ఇతర ప్యాసింజర్ ట్రైన్‌లు ప్రయాణించకపోవటంతో పెద్దప్రమాదం తప్పినట్లు అయిందన్నారు. రైల్వే లైను మరమ్మత్తులు పనులు కొనసాగుతుండడంతో మరో పక్కన వున్న మరో ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలురైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని రైళ్లని అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంటలకొద్దీ నిరీక్షణ కారణంగా ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాంకేతిక లోపమే కారణమా?
గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి సాంకేతిక కారణమా? అన్న రీతిలో రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సీనియర్ మెకానికల్ ఇంజనీర్లు, సాంకేతిక రైల్వే నిపుణులతో కలసి ట్రాక్‌ని పరిశీలిస్తున్నారు. ఇటీవల ఈ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, తాజాగా అలాంటి సంఘటనే జరగడంతో రైల్వే అధికారులు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజా ఘటన కారణంగా రైల్వే శాఖకు సుమారు రూ.2కోట్ల నుంచి 3 కోట్లు నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఆలస్యంగా నడిచిన రైళ్లు ఇవే..
ధనబాద్-అలెప్పి(రైలు నెం:13351) మూడు గంటలు, టాటా-యశ్వంత్ పూర్(18111) నాలుగు, హౌరా-బెంగళూరు(12867) మూడు, భువనేశ్వర్-బెంగళూరు(18463) నాలుగు, శాలిమార్- వాస్కోడిగామా (18047) ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి.
రద్దయిన రైళ్లు ఇవే..
విజయనగరం-విశాఖ పాసింజర్(రైలు నెం:67288), విశాఖపట్నం-పలాస పాసింజర్(67289), పలాస-విశాఖపట్నం(67290), విశాఖ-కొరాపుట్ పాసింజర్( 58538), కొరాపుట్-విశాఖపట్నం( 58537) రైళ్లు రదయ్యాయి.
నిలిచిన ఎక్స్‌ప్రెస్
గజపతినగరం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): విజయనగరం రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో గూడ్స్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ గజపతినగరం రైల్వే స్టేషన్‌కు శుక్రవారం ఉదయం 7.10గంటలకు చేరుకుంది. లైన్‌క్లియర్ లేక మధ్యాహ్నం 1.55 గంటల వరకు స్టేషన్‌లోనే నిలిచిపోయింది. సుమారు 7 గంటలపాటు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విజయనగరం, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు బస్సులను ఆశ్రయించారు. విశాఖ-కోరాపుట్ పాసింజర్(డీఎంయూ) ఉదయం 8.20 గంటలకు గజపతినగరం స్టేషన్‌కు రావల్సి ఉండగా దాన్ని అధికారులు నిలిపివేశారు. కోరాపుట్-విశాఖ, భవానీపట్నం-విశాఖపట్నం వెళ్లే రైలు కూడా రద్దు అయినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ కిషోర్‌కుమార్ తెలిపారు. గుంటూరు-రాయిగడ, దుర్గు-విశాఖపట్నం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తిండి దొరకడం లేదు..
నేను టాటా నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లాలి. గురువారం రాత్రి 6 గంటలకు రైలు ఎక్కాను. సుమారు ఏడు గంటల పాటు గజపతినగరం రైల్వే స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. ఇక్కడ తినడానికి తిండి దొరకడం లేదు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం.
-ప్రభోత్‌కుమార్ టాటానగర్