Delay in Payments చెల్లింపుల్లో జాప్యం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:01 AM
Delay in Payments సాలూరు మున్సిపాల్టీలో అభివృద్ధి పనులు జరుగుతున్నా.. బిల్లులు చెల్లింపుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు.
అభివృద్ధి పనులపై ప్రభావం
సాలూరు,సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపాల్టీలో అభివృద్ధి పనులు జరుగుతున్నా.. బిల్లులు చెల్లింపుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మున్సిపాల్టీలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 లక్షలతో పనులు జరిగాయి. సీసీ రోడ్లు, కల్వర్టులు, కాలువలు నిర్మించారు. బీపీఎస్ నిధులు రూ.18 లక్షలతో పట్టణంలో పలుచోట్ల రక్షిత నీటి పథకాల పనులు చేశారు. 9 నెలల కిందట మంత్రి సంధ్యారాణి ప్రత్యేక నిధులు రూ.1.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటివరకు రూ.35 లక్షల పనులే జరిగాయి. రూ.60 లక్షలతో అన్నా క్యాంటీన్‌ను నిర్మిస్తుండగా.. ఇప్పటివరకు రూ.8 లక్షలు బిల్లులే మంజూరయ్యాయి. గత వైసీపీ సర్కారు సాలూరు పురపాలక సంఘ అభివృద్ధిని విస్మరించింది. అయితే కూటమి రాకతో పరిస్థితి మారింది. పనులు ఊపందు కుంటున్న సమయంలో బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. దీనిపై మున్సిపల్ డీఈ ప్రసాద్‌ను వివరణ కోరగా.. ‘ఇప్పటివరకు పట్టణంలో చేసిన పనులకు బిల్లులు ఆన్‌లైన్ చేశాం. ఇంకా రూ.70 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. సీఎఫ్‌ఎంఎస్‌లో అవి పెండింగ్ ఉన్నాయి. నిధులొస్తే చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం’. అని తెలిపారు.