Delay in e-crop registration ఈ-క్రాప్ నమోదులో జాప్యం
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:59 PM
Delay in e-crop registration జిల్లాలో పంటలకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. గతంతో పోల్చితే కొన్ని మార్పులు చేశారు. దీంతో నమోదు నత్తనడకన సాగుతోంది. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ-క్రాప్ నమోదులో జాప్యం
ప్రతి సర్వే నెంబరుకు నమోదు చేయాల్సిందే
ఈసారి 20 మీటర్ల లోపే రేడియేషన్ జీపీఎస్‌కు అవకాశం
జిల్లా వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో మాత్రమే నమోదు
గంట్యాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంటలకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. గతంతో పోల్చితే కొన్ని మార్పులు చేశారు. దీంతో నమోదు నత్తనడకన సాగుతోంది. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సిబ్బంది అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. దీనిపై గ్రామస్థాయిలో పనిచేసే వ్యవసాయశాఖ అసిస్టెంట్లు తమ సమస్యను జేడీ దృష్టికి తీసువెళ్లారు. ఈ-క్రాప్‌లో భాగంగా పంట పొలాల్లో రైతులు ఏ పంట వేశారు? అనే వివరాలను వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. తొలుత సర్వే నెంబరు ప్రకారం జీపీఎస్ ఆధారంగా రైతు తన పొలంలో ఏ పంట వేశారో తెలుసుకోవాలి. పంటకు రైతు ఫొటోతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టం జరిగినా, వర్షాభావం వల్ల పంట దెబ్బతిన్నా? చివరికి పండించిన ధాన్యం విక్రయించుకోవాలన్నా ఈ-క్రాప్ అడుగుతారు. గతంలో ఈ-క్రాప్ నమోదులో అనేక లోపాలు బయట పడ్టాయి. అప్పట్లో చాలా మంది సిబ్బంది పొలాల్లోకి వెళ్లకుండా ఒకచోట కూర్చుని ఈ-క్రాప్ చేసిన ఘటనలు వెలుగుచూశాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. గతంలో ఈ-క్రాప్ నమోదు చేసే సమయంలో 25 సెంట్లు పైబడి ఉన్న భూమికి మాత్రమే పొలం ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేవారు. ఈసారి అలాకాకుండా ప్రతి సర్వే నెంబరుకు ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఏదైనా రైతుకు రెండు సెంట్లు భూమి ఉన్నా కూడా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. దీనివల్ల సమయం ఎక్కువ తీసుకుంటుందని వ్యవసాయ శాఖ సిబ్బంది వాపోతున్నారు. ఇదే కాకుండా గతంలో ఒక చోట నుంచి ఈ-క్రాప్ నమోదు చేసినప్పుడు 200 మీటర్ల రేడియేషన్ వరకూ జీపీఎస్ లొకేషన్ చూపించేది. ఇప్పుడు అలా కాకుండా 20 మీటర్ల రేడియేషన్‌లో కూడా జీపీఎస్ చూపించడంతో ఇబ్బంది పడుతున్నామని క్షేత్రస్థాయి సిబ్బంది వెల్లడిస్తున్నారు. ప్రతి కమతానికీ వెళ్లాలంటే కష్టమవుతోందని చెబుతున్నారు. దీనివల్లే సకాలంలో ఈ-క్రాప్ నమోదు కావడం లేదంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 4,39,910 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఇందులో 21,92,659 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ మొత్తం నెంబర్లకు ఈ-క్రాప్ నమోదు చేయాలి. అయితే ఇప్పటివరకూ 24,801 ఎకరాల్లో ఉన్న 58,344 సర్వే నెంబర్లకు వ్యవసాయ సిబ్బంది ఈ-క్రాప్ నమోదు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని బొబ్బిలి మండలంలో అత్యధికంగా 18.36 శాతం ఈ-క్రాప్ నమోదు చేయగా, గంట్యాడ మండలంలో అత్యల్పంగా 1.89 శాతం నమోదైంది. ఈ ప్రక్రియను సెప్టెంబరు 15లో పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ లోగా జిల్లా వ్యాప్తంగా శతశాతం ఈ-క్రాప్ నమోదు అవుతుందా? అనేది చూడాలి. ఇదే విషయమై జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తారక రామారావు వద్ద ప్రస్తావించగా గతానికి ఇప్పటికీ ఈ-క్రాప్ నమోదులో స్వల్ప మార్పులు వచ్చాయని, వీటికి అనుగుణంగా నమోదు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎక్కువ సర్వే నెంబర్లు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు.