Share News

Elephant ఏనుగు పిల్ల మృతి

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:27 AM

Death of Elephant Calf జిల్లాలో ఓ ఏనుగు పిల్ల మృతి చెందింది. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  Elephant  ఏనుగు పిల్ల మృతి
మృతి చెందిన ఏనుగు పిల్ల

  • వాటి మధ్య తొక్కిసలాట

  • ఆ కారణంగానే చనిపోయినట్లు అధికారుల వెల్లడి

పార్వతీపురం రూరల్‌, అక్టోబరు5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓ ఏనుగు పిల్ల మృతి చెందింది. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ ప్రాంతంలో కొద్దిరోజులుగా తొమ్మిది గజరాజులు సంచరిస్తున్నాయి. అయితే ఆదివారం సాయంత్రం సేదతీరేందుకు అవన్నీ ఒకేసారి ఆ గ్రామానికి సమీపంలో ఉన్న ముదరై చెరువులో దిగాయి. ఇదే సమయంలో వాటి మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ గున్న ఏనుగు మృతి చెందింది. ట్రాకర్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రేంజర్‌ మణికంఠ తమ సిబ్బందితో అక్కడుకు చేరుకుని పిల్ల ఏనుగును చెరువులో నుంచి బయటకు తీయించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు. కాగా గున్న ఏనుగు మృతి చెందడంతో మిగిలిన ఎనిమిది గజరాజులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఘీంకరించాయి. దీంతో లక్ష్మీనారాయణపురం ప్రజలు బెంబేలెత్తిపోయారు. వాటివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా గ్రామస్థులు బయటకు రాకూడదని మరోవైపు అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వేగవంతంగా తరలించడం మేలు

జిల్లాలో పార్వతీపురం డివిజన్‌లో ప్రస్తుతం ఎనిమిది ఏనుగులు, పాలకొండ డివిజన్‌లో మరో నాలుగు గజరాజులు సంచరిస్తున్నాయి. కొన్నేళ్లుగా వాటివల్ల ఆస్తి, పంట, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. మరోవైపు వివిధ కారణాలతో ఏనుగులు కూడా మృత్యువాతపడుతున్నాయి. గతంలో భామిని మండలంలో నాలుగు గజరాజులు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాయి. కొమరాడ మండలంలో ఒకటి, నాగావళి నది ఊబిలో పడి మరో ఏనుగు మృత్యువాతపడ్డాయి. తాజాగా గున్న ఏనుగు చనిపోయిన నేపథ్యంలో తక్షణమే జిల్లాలో సంచరిస్తున్న గజరాజులను ఈ ప్రాంతం నుంచి తరలించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఖాజీపురం సమీపంలో ..

భామిని: భామిని మండలంలో కొద్దిరోజులుగా సంచరిస్తున్న నాలుగు ఏనుగులు ఖాజీపురం సమీపంలోని జీడి తోటల్లో ఆదివారం సాయంత్రం హల్‌చల్‌ చేశాయి. దీంతో ఆదివాసీ గిరిజనులు తీవ్ర భయాందోళన చెందారు. గత పది రోజులుగా తివ్వకొండ పరిసర గ్రామాల్లోనే అవి సంచరిస్తుండడంతో బయటకు రాలేకపోతున్నామని , ఇప్పటికే వాటి వల్ల మొక్కజొన్న, వరి, అరటి పంటలను నష్టపోయామని వారు వాపోయారు. కాగా రైతులు, ప్రజలను ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ దాలినాయుడు అప్రమత్తం చేశారు. ఏనుగులు ఉన్న ప్రాంతానికి వెళ్లరాదని సూచించారు.

Updated Date - Oct 06 , 2025 | 12:27 AM