e-KYC ఈకేవైసీకి 31 వరకు గడువు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:01 AM
Deadline for e-KYC Extended Until 31st రేషన్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డు దారులకు ఈకేవైసీ అప్‌డేట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు గాను ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అయితే ఈకేవైసీ అప్‌డేట్ కాకుంటే వచ్చే నెలలో రేషన్ పొందే అవకాశం ఉండదని పౌర సరఫరాల శాఖ సిబ్బంది చెబుతున్నారు.

కొమరాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రేషన్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డు దారులకు ఈకేవైసీ అప్‌డేట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు గాను ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అయితే ఈకేవైసీ అప్‌డేట్ కాకుంటే వచ్చే నెలలో రేషన్ పొందే అవకాశం ఉండదని పౌర సరఫరాల శాఖ సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిల్లో సుమారు 8,16,859 మంది సభ్యులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 7,37,657 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా 79,202 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. జీవనోపాధి కోసం వలస వెళ్లిన వారు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా సమీప మీసేవ కేంద్రం, చౌక ధరల దుకాణం, ఆధార్ కేంద్రాల్లో ఈకేవైసీ చేయించుకునే వెసులబాటును ప్రభుత్వం ఇచ్చింది. రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డీఎస్‌వో లాగిన్‌లో ఈ వివరాలు అందుబాటులో ఉంచారు. ఐదేళ్లలోపు పిల్లలు మినహా జాబితాలో పేర్లున్న వారు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ జాబితా డీలర్ల ఉందని .. వారిని సంప్రదించి ఈకేవైసీ వివరాలు తెలుసుకోవాలని చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు ఈకేవైసీని శతశాతం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోందని డీఎస్‌వో రాజేశ్వరి తెలిపారు.